పెథాయ్ తుఫాన్: జనసైనికులకు పిలుపునిచ్చిన పవన్..!

SMTV Desk 2018-12-18 13:34:53  Pavan kalyan, Clling about Pethai Cyclone Effects

అమరావతి, డిసెంబర్ 18: పెథాయ్ తుఫాన్ ప్రభావంతో గుంటూరు నుంచి శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తుఫాన్ ప్రభావం కోస్తా జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేసేందుకు ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది రంగంలోకి దిగారు. ఇటు రాజకీయ పార్టీల కార్యకర్తలు కూడా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా.. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని జనసైనికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

‘తిత్లీ తుఫాన్ మిగిల్చిన కష్టాన్ని మర్చిపోక ముందే పెథాయ్ రూపంలో మరో తుఫాన్ రాష్ట్రంపైకి దూసుకొచ్చింది. శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలపై ఈ తుఫాన్ ప్రభావం ఎక్కువగా పడుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలోని ప్రజలకి మనమందరం అండగా నిలవాలి. ఈ విపత్తు ప్రభావం మన తీరం నుంచి వెళ్లిపోయే వరకు అవసరమైన సహాయ కార్యక్రమాలు చేపట్టాలని జనసైనికులకు విజ్ఞ‌ప్తి చేస్తున్నానన్నారు పవన్ కళ్యాణ్ .