ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం ...

SMTV Desk 2018-08-27 16:08:46  ANDHRAPRADESH,CHANDRABABU,MUMBAI

నేడు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ ఆర్థిక రాజధాని ముంబై తాజ్ ప్యాలెస్ హోటల్ లో పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, 2050 నాటికి ఏపీ ప్రపంచంలో బెస్ట్ డెస్టినేషన్ గా ఉండాలనేది తన లక్ష్యమని, దేశంలో ఏపీ అగ్రస్థానంలో ఉండాలనేదే తన విజన్ అని చెప్పారు. గత నాలుగేళ్లుగా ఏపీ వృద్ధి రేటును నమోదు చేస్తోందని తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ వరుసగా అగ్రస్థానంలో నిలబడుతోందని చెప్పారు. ఏపీ పెట్టుబడులకు అనువైన ప్రాంతమని ఆయన తెలిపారు. విశాఖ-చెన్నై కారిడార్, కర్నూలు-చెన్నై కారిడార్, బెంగుళూరు-చెన్నై కారిడార్ ఇలా వేర్వేరు ఉత్పత్తి నోడ్లను నిర్మిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ఏరోస్పేస్, హెల్త్, పెట్రో కెమికల్స్, రక్షణ రంగాలకు తమ వద్ద సరైన విధానాలు ఉన్నాయని... భూ బ్యాంకు కూడా అందుబాటులో ఉందని చెప్పారు. భవిష్యత్తులో విద్యుత్ ఛార్జీలను పెంచబోమని తెలిపారు. ఏపీలో హోటల్ డెవలప్ మెంట్ కు టాటా గ్రూపు సహకరించాలని, విజయవాడ-సింగపూర్ ల మధ్య విమానాలు నడపాలని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ప్రజా రవాణా వ్యవస్థలో టాటా గ్రూపు సాంకేతిక సహకారాన్ని అందించాలని విన్నవించారు.రతన్ టాటా, టీసీఎస్ సీఈవో చంద్రశేఖరన్ లు కూడా ఈ భేటీ లో పాల్గొన్నారు.