బీకాంలో ఫిజిక్సే కాదు.. కెమిస్ట్రీ కూడా ఉందట..!

SMTV Desk 2018-06-24 11:56:18  andhra university b,com certificate issue, au b.com b.com chemistry, visakhapatnam

విశాఖపట్నం, జూన్ 24 : బీకాంలో ఫిజిక్స్.. ఉందని ఒక ప్రజాప్రతినిధి చెప్పడంతో అప్పటిలో అందరూ తెగ ఆశ్చర్యపోయారు. అక్కడితో అతనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ట్రోల్స్ మీద ట్రోల్స్‌తో ఆటాడుకున్నారు. ఆయన మాత్రం నేను బీకాంలో ఫిజిక్స్ చదివానని స్థిరంగా చెప్పారు. బీకాంలో ఫిజిక్స్ మాత్రమే కాదు కెమిస్ట్రీ కూడా ఉంది. నమ్మడం లేదా..? ఇది మేం చెబుతున్న మాట కాదు. సీఆర్ రెడ్డి.. లాంటి మహానుభావుడు తొలి వైస్ ఛాన్స్‌లర్‌‌గా వ్యవహరించిన ఆంధ్ర యూనివర్సిటీ జారీ చేసిన సర్టిఫికెట్ చెబుతున్న మాట ఇది. ఎందరో విద్యార్థులను ప్రయోజకులుగా తీర్చిదిద్దిన ఘన చరిత్ర ఉన్న ఆంధ్రా విశ్వవిద్యాలయం ఓ విద్యార్థికి బీకాం కెమిస్ట్రీతో (ఓడీ) ఒరిజినల్ డిగ్రీ జారీ చేసింది. సైన్స్ గ్రూప్‌లో డిగ్రీ చేసిన విద్యార్థికి బీకాం ఓడీ ఇచ్చేసింది. పార్ట్-1లో ఇంగ్లిష్, తెలుగు, హెచ్‌సీ.. పార్ట్-2లో కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల్లో పరీక్షలు రాశాడని పేర్కొంటూ బీఎస్సీ బదులుగా బీకాంతో ఓడీ జారీ చేసింది. పట్టాను విద్యార్థికి అందించాక తప్పు దొర్లినట్టు గుర్తించిన ఏయూ అధికారులు నాలుక కరుచుకున్నారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ సర్టిఫికెట్‌ను సరిచేసి ఇచ్చే పనిలో నిమగ్నమయ్యారు.