పోలవరం ఆంధ్రుల హక్కు : చంద్రబాబు

SMTV Desk 2018-05-21 20:17:00  chandrababu naidu, polvaram issue, modi, west godavari

రొద్దం, మే 21 : తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదాపై ప్రధాని మోదీ హామీ ఇచ్చారని... భాజపాతో పొత్తు లేకపోతే మరో 15సీట్లు గెలిచేవారమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. పోలవరం ఆంధ్రుల హక్కు అని దానిని సాధించి తీరతాము అని ఆయన చెప్పారు. నేడు అనంతపురం జిల్లా రొద్దం మండలం తురకలాపట్నంలో జరిగిన సభలో చంద్రబాబు ప్రసంగించారు. ప్రజలు తనపై ఎంతో నమ్మకంతో గెలిపించారని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఏ వ్యక్తికి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని... దీనిలో భాగంగానే రైతులకు రుణమాఫీ, డ్వాక్రా మహిళలకు రూ.10వేల కోట్ల ఆర్థిక సాయం చేసినట్లు ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ.53వేల కోట్లు ఖర్చుచేస్తున్నట్లు సీఎం వివరించారు. ప్రమాదాల్లో చనిపోయిన వారికి చంద్రన్న బీమా కింద రూ. ఐదు లక్షలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వ పాలనలో వ్యవసాయ రంగం, పరిశ్రమలు, గృహాలకు విద్యుత్తు అందక అవస్థలు పడ్డారని పేర్కొన్నారు. తెదేపా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యుత్తు కష్టాలు తీరాయన్నారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని చెప్పిన ఏకైక ప్రభుత్వం తమదేనని పేర్కొన్నారు. హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించడంతో కష్టాలు మొదలయ్యాయని సీఎం చెప్పారు. కేంద్రం సహకరించి ఉంటే ఇంకెన్నో కార్యక్రమాలు నిర్వహించేవారమని వ్యాఖ్యానించారు.