కాకాని విగ్రహం తొలిగింపు.. ఉద్రిక్తత

SMTV Desk 2018-05-12 20:37:20  kakani venkatratnam, kakani idol, vijayawada, benji cricle

విజయవాడ, మే 13 : బెంజ్‌ సర్కీల్‌లో ఆదివారం ఉదయం ఉద్రిక్తత నెలకొంది. జై ఆంధ్ర ఉద్యమనేత కాకాని వెంకటరత్నం విగ్రహాన్ని అర్ధరాత్రి సమయంలో అధికారులు తొలిగించారు. తమ అనుమతి లేకుండా విగ్రహం తొలగించారని నిరసిస్తూ ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, పలు రాజకీయ పార్టీలు ఆందోళనకు దిగాయి. బెంజి సర్కిల్ వద్ద పైవంతెన పనులకు అడ్డంకిగా ఉండటంతోనే విగ్రహం తొలగించాల్సి వచ్చిందని.. పనులు పూర్తయ్యాక తిరిగి యథాతథంగా ప్రతిష్టిస్తామని అధికార పార్టీ నేతలు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా వాసులకు సుపరిచితమైన వ్యక్తి కాకాని వెంకటరత్నం. ఆయన గురించి తెలియని వారంటూ ఉండరు. కృష్ణా జిల్లాలోని అకునూరులో జన్మించిన ఆయన.. మహాత్మాగాంధీతో పాటు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని అందరినీ ఆకర్షించారు. విద్యార్ధి నాయకుడిగా అలుపెరగని పోరాటం చేశారు. జై ఆంధ్ర ఉద్యమాన్ని పెద్దఎత్తున చేపట్టిన ఆయన పోరాటం చేస్తూనే తుది శ్వాస విడిచారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన అప్పటి ప్రభుత్వం.. విజయవాడలో అత్యంత కీలకమైన బెంజి సర్కిల్ లో ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించింది. కాకాని వెంకట రత్నం విగ్రహం తొలగింపునకు తాము అనుమతించలేదని కాకాని వెంకటరత్నం కుటుంబం సహా అభిమానులు చెబుతున్నారు. అభివృద్ది పేరుతో విగ్రహాలను కూల్చడంపై వైకాపా నేత యలమంచిలి రవి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కృష్ణాజిల్లాకు ఎంతో సేవ చేసిన కాకాని విగ్రహాన్ని తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.