సిరియాలో మరోసారి యుద్ధవాతావరణం

SMTV Desk 2018-04-14 12:16:53  Syria latest news, USA attacks on syria, donald trump, russia

డమాస్కస్, ఏప్రిల్ 14 ‌: సిరియా ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో అత్యంత భయానక జీవితాన్ని గడుపుతుంది. గత కొన్నేళ్లుగా తిరుగుబాటుదారులు, అధికార ప్రభుత్వలా యుద్ధభూమిని తలపిస్తుంది. అక్కడ జరగుతున్న నరమేధంకు ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశంతో సిరియాపై మెరుపు దాడులు చేపట్టడంతో మరోసారి యుద్ధవాతావరణం నెలకొంది. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు వ్యతిరేకంగా అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగాయి. ఫ్రాన్స్‌, యూకే దళాలు కూడా అమెరికాతో చేతులు కలిపి సిరియాపై సైనిక దాడులు చేస్తున్నాయి. శుక్రవారం రాత్రి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం సిరియాలో జరిగిన రసాయన దాడులపై ఆగ్రహంతో, దానికి ప్రతీకార చర్యగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. అయితే సిరియా మాత్రం నిషేధిత ఆయుధాలను తాము వాడలేదని వాదిస్తోంది. తూర్పు డమాస్కస్‌ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడుతున్నాయని, పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంతో ఆకాశం నారింజ రంగులో కన్పిస్తోందని ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. అసద్‌ రసాయన ఆయుధాలను వాడినందుకు శిక్షగా, మరోసారి రసాయన ఆయుధాలు వాడకుండా ఆపేందుకు సిరియాపై వైమానిక దాడులు చేస్తున్నామని ట్రంప్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు.