సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడి...71 మంది సైనికులు మృతి

SMTV Desk 2019-12-13 11:44:11  

నైజీరియా దేశంలోని నైగర్‌ తిల్లబెరి ప్రాంతంలో మంగళవారం రాత్రి సైనిక స్థావరంపై వందలాది మంది ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మాలి సరిహద్దుల్లోని సైనిక స్థావరంపై ఐసిస్‌ ఉగ్రవాదులు మోర్టార్లు, రాకెట్ లాంచర్లతో విరుచుకుపడి 71 మంది సైనికులను పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రదాడిలో 71 మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో 12 మంది గాయపడ్డారని, కొందరి ఆచూకీ గల్లంతయ్యిందని నైజీరియా రక్షణ మంత్రి ప్రకటించారు. ఈ దాడిలో వందలాది మంది ఉగ్రవాదులు పాల్గొన్నారని, వీరిలో కొంత మందిని సైన్యం హతమార్చిందని తెలిపారు. ఉగ్రవాదులు, సైన్యానికి మధ్య దాదాపు మూడు గంటల పాటు హోరాహోరీ కాల్పులు జరిగాయని వివరించారు. మోర్టార్లు, బాంబులతో విచక్షణారహితంగా ఉగ్రవాదులు దాడిచేశారు. ఈశాన్య సరిహద్దుల్లోని బోకోహారమ్ తీవ్రవాదులు.. పశ్చిమ సరిహద్దుల్లో ఐసిస్ ఉగ్రవాదులతో నైజీరియా సైన్యం నిరంతరం పోరాటం చేస్తోంది. ఉగ్రదాడితో నైజీరియా అధ్యక్షుడు ఇస్సోఫవ్ మహ్మద్ ఈజిప్టు పర్యటనను రద్దుచేసుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. ఈజిప్టు వేదికగా జరుగుతున్న శాంతి, భద్రత అంశాలపై జరుగుతున్న సమావేశంలో పాల్గొనడానికి ఆయన అక్కడకు వెళ్లారు. ఉగ్రదాడి నేపథ్యంలో అక్కడకు భారీగా చేరుకున్న సైన్యం ముష్కరుల కోసం అడగడుగునా జల్లెడపట్టింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టు సైన్యం ప్రకటించింది. నైజీరియాలో ఉగ్రదాడి కారణంగా వచ్చే వారం పౌ నగరంలో భద్రతపై నిర్వహించనున్న సమావేశాన్ని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనుయల్ మెక్రాన్ వాయిదా వేశారు. ఈ సమావేశానికి ఐదు దేశాల అధ్యక్షులు హాజరుకానున్నారు. జీ5 పేరుతో ఉగ్రవాద వ్యతిరేక దళాలను నైజీరియా, బుర్కినో‌ఫెసో, మాలీ, మౌరిటానియా, చాద్‌ కలిసి ఏర్పాటు చేశారు. కాగా, సోమవారం కూడా పశ్చిమ తహౌ ప్రాంతంలోని సైనిక స్థావరంపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. భారీగా ఆయుధాలు, వాహనాలతో తీవ్రవాదులు దాడి చేశారు.