డిసెంబరు 26న సంపూర్ణ సూర్యగ్రహణం...ఈ రాశులపై ప్రభావం!

SMTV Desk 2019-12-19 14:09:14  

డిసెంబరు 26న గురువారం ఈ ఏడాదిలో చిట్టచివరి, మూడో సూర్యగ్రహణం సంభవించనుంది. ఇది డిసెంబరు 26 గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభమై 11.10 వరకు కొనసాగుతుంది. మూల నక్షత్రం మకర , కుంభ లగ్నాలలో ధనుస్సు రాశిలో త్రిపాదాధిక కేతుగ్రస్త కంకణాకార సూర్య గ్రహణం ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం స్పర్శ కాలం ఉదయం 8 గంటల 9 నిమిషాలకు ప్రారంభం కాగా, మధ్యకాలం ఉదయం తొమ్మిది గంటల 31 నిమిషాలు, మోక్ష కాలం ఉదయం 11.11 నిమిషాలకు అవుతుంది. మొత్తం పుణ్యకాలం సమయం మూడు గంటల రెండు నిమిషాలు. ఈ గ్రహణం భార‌తదేశం, శ్రీలంక‌, కొన్ని గ‌ల్ఫ్ దేశాలు, సుమ‌త్రా, మ‌లేషియా, సింగ‌పూర్‌ల‌లో కనువిందు చేయనుంది. ఇలాంటి సంపూర్ణ సూర్యగ్రహణం మ‌రో 16 ఏళ్లు తర్వాత సంభవిస్తుంది. ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది కాబట్టి ఈ గ్రహణాన్ని ఆరాశి వారు, అష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి వృషభ రాశి వారు, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి కన్య రాశి వారు చూడకపోవడం మంచిదని జ్యోతిషులు చెబుతున్నారు. గ్రహణ సమయంలో సూర్యకిరణాలు పడకుండా చూడాలని అంటున్నారు. మిగతా రాశుల వారికి ఈ గ్రహణ ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంటున్నారు. సూర్యుడు వ్యక్తిత్వానికి, సాత్విక గుణానికి కారకుడు... అహంకారానికి, తమోగుణానికి రాహువు కారకుడు ఈ రెండింటి కలయిక మనిషి వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతుంది కాబట్టి తమ జన్మరాశుల్లోని చెడు స్థానాల్లో గ్రహణం సంభవించినవారు చూడరాదని పూర్వీకులు సూచించారు. అయితే దీని ప్రభావం చాలా తక్కువ శాతం ఉంటుంది ..ఎందుకంటే ఏ వ్యక్తిపై అయినా కూడా అతను పుట్టిన సమయానికి ఉన్న జాతక ప్రభావం అనేదే ఎక్కువ ఉంటుంది తప్ప గ్రహణ ప్రభావం కాదని, అది జీవితాన్ని ప్రభావితం చేయదని జ్యోతిషులు చెబుతున్నారు. సూర్యుడు , భూమికి మధ్యలో చంద్రుడు వచ్చి ఆ నీడ సూర్యుడిపై పడినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణం, చంద్రుడు సూర్యుడికి మధ్యలో నుంచి అంచులో అగ్నివలయంలాగా కనిపిస్తాడు. అందుకే దీనిని కంకణాకర గ్రహనం అంటున్నారు. మార్గశిర అమావాస్య నాటి అబ్ధిక కార్యక్రామాన్ని యధావిధిగా అపరాన్నకాలంలో జరుపుకోవచ్చుని పండితులు చెబుతున్నారు. గ్రహణ పట్టు, విడుపు మధ్యస్నానాలాచరించే వారు వారికున్న మంత్రనుష్టానాలతో ఆచరించి యధావిధిగా స్నానాదులు ఆచరించికోవచ్చట. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర, రాశ్యాదులలో గ్రహణం చెడు ఫలితాలను ఇస్తుంది. ఎవరి జన్మరాశి, జన్మ నక్షత్రంలో గ్రహణం ఏర్పడుతుందో వారికి విశేషంగా పూజలు, జపాలు, దానాలు చేయాలి. గ్రహణం పడిన నక్షత్రంలో ఆరు నెలలు ముహూర్తాలు నిషేధిస్తారు. జన్మరాశి నుంచి 3,6,10,11 రాశులలో గ్రహణమైన శుభప్రధం 2,5,7,9 రాశులలో మధ్యమం, మిగిలిన రాశులలో అరిష్టం. ప్రస్తుత సూర్యగ్రహణం మూల నక్షత్రం, ధనుస్సు రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నక్షత్ర కలిగిన వ్యక్తులు దానాలు, జపాలు చేయాలి.