పెండింగులో మూడు హామీలు : హరిబాబు

SMTV Desk 2018-03-11 14:37:44  bjp leader,Kambhampatti Haribabu, central govt, three projects.

విజయవాడ, మార్చి 11 : విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇంకా మూడు హామీలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని భాజపా ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌కు ఏమీ చేయలేదంటూ తెలుగుదేశం పార్టీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన ఆరోపించారు. విజయవాడలో నిర్వహించిన భాజపా కోర్‌ కమిటీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం చేయాల్సిన సాయమంతా చేస్తోందని.. విభజన చట్టంలోని పెండింగ్‌ హామీలను త్వరలోనే నెరవేరుస్తామన్నారు. భాజపా రాష్ట్రాన్ని మోసం చేసిందని కొందరు విమర్శించడం దారుణమని హరిబాబు అన్నారు. సమైక్య రాష్ట్రంలో 13 జిల్లాల్లో ఒక్క జాతీయ సంస్థ కూడా లేదని.. మూడేళ్లలో భాజపా ప్రభుత్వం 9 జాతీయ సంస్థలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఇతర రాష్ట్రాలతో చర్చించిన అనంతరం విశాఖ రైల్వేజోన్ వస్తుందని, కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైందని తెలిపారు.