ఉల్లి ధరల పెంపుపై ముఖ్యమంత్రి నిరసన

SMTV Desk 2019-12-13 11:43:36  

అడ్డుఅదుపు లేకుండా పెరిగిపోతున్న ఉల్లి ధరలపై పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి, ఆయన కేబినెట్ మంత్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లిమాలలు ధరించి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. పుదుచ్చేరి కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, మంత్రి నమశ్శివాయం నేతృత్వంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. సీఎం నారాయణస్వామి, మంత్రులు షాజహాన్‌, కమలకన్నన్‌, అఖిల భారత కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి సంజయ్‌దత్‌, ఎమ్మెల్యే విజయవేణి తదితరులు పాల్గొన్నారు. అందరూ ఉల్లి మాలలు ధరించి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల అవసరాలు తీర్చడం కంటే స్వప్రయోజనాలపైనే బీజేపీ దృష్టిపెట్టిందన్నారు. బంగారం ధరలు పెరిగితే ఎవరికీ ఇబ్బంది లేదని, కానీ పెరిగిన ఉల్లిధరల వల్ల దేశ ప్రజలు మొత్తం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉల్లి ధరల పెరుగుదలతో శుభకార్యాలు కూడా రద్దవుతున్నాయని నారాయణస్వామి అన్నారు.