అనుమతులు లేని వాటికి రిజిస్ట్రేషన్‌లు బంద్

SMTV Desk 2019-12-16 12:47:06  

ప్రతి నిర్మాణం, లేఅవుట్ ఇక అనుమతితోనే, అనుమతి మేరకే జరిగేలా పురపాలక శాఖ చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు అనుమతులు లేకుండా వెలిసే నిర్మాణాలు, లేఅవుట్లను నియంత్రించడానికి కొత్తగా తీసుకువచ్చిన చట్టాన్ని విధిగా అమలు పరచాలని స్థానిక పురపాలక సంస్థలు, సంఘాలకు సంకేతాలను పంపించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మహానగర శివారులోని నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ తన పరిధిలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలకు రిజిస్ట్రేషన్ చేయరాదని, నీటి, విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయకూడదంటూ లేఖలు రాశారు. 81 భవనాలు అనుమతులు లేకుండా నిర్మాణాలను సాగిస్తున్నట్టు ఆ విభాగాలకు రాసిన లేఖలో స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ మునిసిపాటీల చట్టం 2019లోని సెక్షన్ 178 సబ్ సెక్షన్ 3, 4 ప్రకారం గా చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆ 81 భవన యజమానులకు నోటీసులు జారీచేశారు. తెలంగాణ మునిసిపల్ చట్టం 2019 అమలుతో అన్ని పురపాలక సంస్థలు, సంఘాలు తమతమ పరిధిలో ప్రణాళికాబద్దమైన అభివృద్ధి, అనుమతులతో కూడిన నిర్మాణాలను, లేఅవుట్లను ఏర్పాటు జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇదివరకే పురపాలక శాఖ స్పష్టంచేసినట్టు అధికారులు వెల్లడిస్తున్నారు. అ క్రమ నిర్మాణాల నియంత్రణకు జిల్లాల వారిగా టాస్క్‌ఫో ర్స్, ప్రత్యేకంగా ట్రిబ్యునల్‌ను ఏర్పాటుచేయాలని ప్రభు త్వం నిర్ణయించింది.ఇటీవల పురపాలక విభాగపు అధికారులతో సమావేశం జరుగనున్న సందర్భంలో శక్తి పరిరక్షణ భవన నియమావళి(ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ ఇసిబిసి) అమలు తీరుపై మంత్రి కెటి రామారావు ప్రస్తావించారు. దీంతో ఉన్నతాధికారులు ఇసిబిసిని అమలు చేస్తున్న తీరుపై ప్రత్యేక నివేదికను సిద్దం చేశారు. నివాసేతర వ్యాపార సముదాయాల్లో ఇసిబిసిని అమలు తప్పనిసరిచేయాలని అధికారులను మంత్రి కెటిఆర్ ఆదేశించారు. విద్యుత్ వాడకం తగ్గించడం, గాలి వెలుతురు అధికంగా సరఫరా జరిగేలా, సౌరవిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై శ్రద్ద చూపాలని రియల్టర్లకు తెలియజేయాలని మంత్రి అధికారులకు సూచించినట్టు తెలిసింది.తెలంగాణ మునిసిపాలిటీల చట్టం 2019లోని సెక్షన్ 178(1)లో అక్రమ నిర్మాణాలను గుర్తించడానికి, నియంత్రించడానికి, సకాలంలో చర్యలు తీసుకోవడానికి జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్షన్ 178(3)లో మునిసిపాలిటీ నుంచి మంజూరైన అనుమతుల ప్లాన్ లేకుండా నిర్మించే భవనం లేదా భవనంలోని భాగం లేదా నిర్మాణంను రిజిస్ట్రేషన్ చేయరాదంటూ స్పష్టం చేస్తున్నది. సెక్షన్ 178(4)లో ఏదేని అధికారికంగా అనుమతులు పొందిన భవనాలకు విద్యుత్, నీటి కనెక్షన్‌లను ఇవ్వాలని వెల్లడిస్తున్నది. ఈ రెండు సెక్షన్‌లను పరిగణలోకి తీసుకున్న నిజాంపేట్ మునిసిపల్ కార్పోరేషన్ కమిషనర్.. తన పరిధిలో గుర్తించిన 81 భవనాలకు రిజిస్ట్రేషన్ చేయకూడదని, విద్యుత్, నీటి కనెక్షన్‌లను మంజూరు చేయకూడదని నోటీసులు జారీచేశారు. ఇది స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 178(8) సెక్షన్ ప్రకారంగా మునిసిపల్ కమిషనర్ చట్టబద్దంగా లేని భవనాన్ని ఖాళీ చేసేందుకు, పరిస్థితిని పరిగణలోకి తీసుకుని కూల్చివేసేందుకు కూడా నోటీసులు జారీచేసే అధికారాన్ని కలిగి ఉన్నారు.చట్టంలోని 179(1) ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ భవన ట్రిబ్యునల్‌ను నియామకంచేయవచ్చును. భూ మి అభివృద్ధి పరిచే విషయంలోనూ, భవన నిబంధనల అతిక్రమణలోనూ అప్పీల్ చేయడానికి, వినడానికి, జరిమానాలను వేయడానికి ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేయనున్నది. ఈ ట్రిబ్యునల్‌లో ఒక చైర్‌పర్సన్‌తోపాటు మొత్తం ఐదుగురు సభ్యులకు మించి ఉండరాదని చట్టం స్పష్టం చేసింది. న్యాయ విభాగం నుంచి జిల్లాస్థాయి న్యాయమూర్తి, డిటిసిపిలో డైరెక్టర్ స్థాయి అధికారి ఉండాలని చట్టం సూచిస్తున్నది. ఈ ట్రిబ్యునల్‌ను త్వరలోనే ఏర్పాటు చేసేందుకు పురపాలక శాఖ సన్నాహాలు చేస్తున్నది. చట్టం ప్రకారంగా నోటీసులు జారీచేసిన నిజాంపేట్ మున్సిపల్ కమిషనర్ ఇప్పటి వరకు 81 భవనాలపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తాఖీదులతోనే సరిపెట్టారు. ఫలితంగా నోటీసులు అందుకున్న భవన యజమానులు నిర్మాణాలను యదేచ్చగా సాగిస్తున్నారు. ఈ వ్యవహారంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.