శేషాచల అటవీ ప్రాంతంలో పేలుడు పరికరాల కలకలం...

SMTV Desk 2018-01-30 12:07:40  EXPLOSIVE MATERIALS, SESHACHALAM FOREST, CHANDRAGIRI, CHITTOR

చంద్రగిరి, జనవరి 30 : చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శేషాచల అటవీ ప్రాంతంలో పేలుడు పరికరాలకు ఉపయోగించే వస్తువులు దొరకడం కలకలం రేపింది. కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ఫోర్స్‌ అధికారులకు సోమవారం రాత్రి పేలుడు పరికరాలు లభ్యమయ్యాయి. అధికారుల సమాచారం ప్రకారం.. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో భాగంగా తిరుపతి శ్రీవారి మెట్టు వద్ద టాస్క్‌ఫోర్స్‌ అధికారులు కూంబింగ్‌ నిర్వహిస్తుండగా ఒక బ్యాగును గుర్తించారు. అందులో సర్క్యుట్‌ బోర్డులు, సెల్‌ఫోను, వాక్‌మెన్, రెసిస్టర్లు, కెపాసిటర్లు, కండెన్సర్లు ఇతర పరికరాలను అధికారులు గుర్తించారు. అధికారుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న బాంబు స్య్వాడ్‌ వాటిని పరిశీలించి పేలుళ్లు సృష్టించడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. కాగా సంచీపై తమిళనాడు తిరుచ్చికి చెందిన చిరునామా ఉందని.. అసలు ఎక్కడ నుండి వీటిని తెచ్చారు? ఎందుకు ఇక్కడ పెట్టారు? అనే పలు విషయాలపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.