మన సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత యువతదే : వెంకయ్య

SMTV Desk 2018-01-13 13:52:27  vice president, venkaiah naidu, sankranthi festival, nellore district.

నెల్లూరు, జనవరి 13 : మన సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం స్వర్ణభారత్‌ ట్రస్టులో సంక్రాంతి శోభ వెల్లివిరిసింది. రంగురంగుల రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, గాలిపటాలు ఎగురవేయడం వంటి వివిధ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సొంత ఊరిలో అందరి మధ్య సంక్రాంతి సంబరాలు చేసుకోవటం ఆనందంగా ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత యువతపైనే ఉందన్నారు. అలాగే వివేకానందుని జయంతి సందర్భంగా యువత ఆయన నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ప్రధాని మోదీ ఎప్పుడూ ఒక మాట చెబుతారు. ఎవరికి అప్పగించిన పనిని వాళ్లు సజావుగా చేయాలి, అప్పుడే దేశం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.