కిమ్‌తో మాట్లాడతా.. కానీ కొన్ని షరతులు : ట్రంప్

SMTV Desk 2018-01-07 12:08:38  TRUMP PHONE CALL, KIM JANG UN, NORTH KORIA.

వాషింగ్టన్, జనవరి 7 : అగ్రరాజ్యం అమెరికాకు, ఉత్తర కొరియాకు మధ్య మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. కిమ్ జా౦గ్ ఉన్ తో ఫోన్ లో మాట్లాడతానన్నారు. మేరీ ల్యాండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ కు.. మీరు కిమ్‌తో మాట్లాడుతారా? అన్న మీడియా ప్రశ్నకు స్పందిస్తూ.. "మాట్లాడతాను. నాకు ఆయనతో మాట్లాడడానికి ఎలాంటి అభ్యంతరం లేదు. కాని కొన్ని షరతులు ఉన్నాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ కారణంగా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య చర్చలు జరగనున్నాయి. ఇది నిజంగా చాలా గొప్ప విషయం. నేను కలగజేసుకోకపోయి ఉంటే ఆ ఇరు దేశాల మధ్య ఎప్పటికీ చర్చలు జరిగేవి కావు. చర్చలు ఫలిస్తే ప్రపంచానికే అది శుభవార్త అవుతుంది" అని సమాధానమిచ్చారు. కాగా రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియా, దక్షిణ కొరియా ప్రతినిధులు ఈ నెల 9న సమావేశం కానున్నారు.