కాలిఫోర్నియా, జనవరి 4 : సంవత్సరాలు మారి ఓ మహిళకు ఇద్దరు కవలలు పుట్టిన అరుదైన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగింది. సాధారణంగా కవలలు అంటే నిమిషాల తేడాతో జన్మించడం జరుగుతుంది. కానీ ఏకంగా సంవత్సరాలు మారి జన్మించడం అంటే అరుదైన విషయమే. కాలిఫోర్నియాలో మరియా ఎస్పెరాంజ్ అనే మహిళకు 18 నిమిషాల వ్యవధితో కవల పిల్లలు మగ, ఆడ శిశువులు జన్మించారు. అయితే, 2017 డిసెంబరు 31 రాత్రి 11.58 నిమిషాలకు అబ్బాయి జన్మించగా, 18 నిమిషాల తర్వాత అంటే 2018 జనవరి ఒకటో తేదీన 12.16 నిమిషాలకు పాప పుట్టింది. దీంతో ఈ కవల పిల్లలు వేర్వేరు సంవత్సరాల్లో పుట్టినట్లైంది. ఆసుపత్రి వైద్యులు తమ 35ఏళ్ల సర్వీసులో ఇలా ఎప్పుడూ జరగలేదని తెలిపారు. అంతేకాకుండా 2018లో తమ ఆస్పత్రిలో జన్మించిన మొదటి చిన్నారులు కావడంతో వీరికి ఆ ఆస్పత్రి యాజమాన్యం బహుమతులు అందజేసింది.