రబీలో వరికి నీరు ఇవ్వలేం: చంద్రబాబు

SMTV Desk 2017-11-19 11:46:34  chandrababu about rabi, andhrapradesh updates

గుంటూరు, నవంబర్ 19: నాగార్జునసాగర్‌ ఆయకట్టు పరిధిలో ఈ ఏడాది రబీలో వరికి నీరు ఇవ్వలేమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఉండవల్లి నుంచి బోరుపాలెం వరకూ 18.2 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న నాలుగు లైన్ల సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని వెంకట పాలెం-మందడం మధ్య శనివారం ముఖ్యమంత్రి ప్రారంభించారు. నీలి, ఆకుపచ్చ రాజధానిని నిర్మించే కార్యక్రమంలో భాగంగా పచ్చదనం ప్రాజెక్టుకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మందడంలో తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సభలో సిఎం మాట్లాడారు. సాగర్‌కు ఎగువ నుంచి కొంత నీరొచ్చినా ఇప్పుడు వరికి నీరిస్తే వచ్చే సీజన్‌లో మళ్లీ ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. శ్రీశైలం ఎగువన ఆల్మట్టి, ఇతర ప్రాజెక్టుల నుంచి అక్కడి వారు ఎత్తిపోతలు నిర్మించుకుని సాగర్‌కు నీరు విడుదల చేయలేదని అన్నారు. దీని వల్ల భవిష్యత్తులో వరదలు వస్తే తప్ప నీరు వస్తుందన్న భరోసా లేకుండా పోయిందన్నారు. పోలవరం ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి నీరు తీసుకువస్తామన్నారు. చింతలపూడి ఎత్తిపోతల ద్వారా కృష్ణా జిల్లాలోని ఎడమ కాలువకు నీరు ఇస్తామని, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని కుడి కాలువ పరిధిలో మాత్రం కేవలం ఆరుతడి పంటలకే అవకాశం ఉంటుందని తెలిపారు. మొదటి దశలో ఆరుతడి పంటలు వస్తే సాగర్‌ నిండితే రబీలో వరికి అవకాశం ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు పి.నారాయణ, పత్తిపాటి పుల్లారావు పాల్గొన్నారు.