లాంచీ ప్రయాణం ఆహ్లాదకరం..

SMTV Desk 2017-10-20 16:20:17   Nagarjuna Sagar - Srisailam, AP Tourism Department, Income source.

మాచర్ల, అక్టోబర్ 20 : ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నాగార్జున సాగర్ నీటి మట్టం రోజురోజుకూ పెరుగుతూ ఉంది. దీనిని అవకాశంగా తీసుకొని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆదాయంపై దృష్టి సారించింది. ఈ ఆదాయాన్ని నాగార్జున సాగర్ - శ్రీశైలం మధ్య లాంచీ ప్రయాణం ద్వారా రాబట్టడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. 5 ఏళ్ల క్రితం లాంచీ ప్రయాణం ఉన్నా గత 3 ఏళ్ళుగా సాగర్ లో తక్కువ నీటి మట్టం కారణంగా నిలిచిపోయింది. తాజాగా సాగర్ నీటిమట్టం పెరగడం వల్ల నిలిచిపోయిన పనులు పునరుద్ధరించాలని ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఇందుకు పర్యాటక శాఖ అధికారులు భద్రత పరంగా ఉన్న లోపాలను ఇటీవల పరిశీలించారు. సాగర్ లో నీటిమట్టం 580 అడుగులు ఉండేలా చూసుకొని లాంచీ ప్రయాణానికి శ్రీకారం చుడతామని నిర్ధారణకు వచ్చారు. నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలానికి మధ్య దూరం 120 కిలోమీటర్లు ఉండగా దానికి 6 గంటల సమయం పడుతుంది. ఈ లాంచీ ప్రయాణం ఎత్తైన కొండల మధ్య, పచ్చని అటవీ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. అంతేకాకుండా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పసందైన విందు కూడా ఉండేటట్లు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. సాగర్ నుంచి శ్రీశైలానికి తీసుకొని వెళ్లి అక్కడ దైవ దర్శనం చేయిస్తారు. ఈ లాంచీ ప్రయాణానికి అవసరమైన పనులు జోరుగా సాగుతున్నాయి.