రాజకీయాల్లోకి పునః ప్రవేశం పొందబోతున్న లగడపాటి?

SMTV Desk 2017-06-06 18:34:54  Andhra Pradesh,Lagadapati,CM,Chandrababu,

విజయవాడ, జూన్ 6 : సమైక్యాంధ్ర ఉద్యమంలో మారుమ్రోగిన పేరు ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్. ఈ సమైక్యవాది, తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి రాజ‌కీయాల‌కు దూరంగా ఉంటున్నారు. అయితే, ల‌గ‌డ‌పాటి మ‌ళ్లీ క్రియాశీల రాజ‌కీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. లగడపాటికి స‌ర్వేల మాంత్రికుడు అనే బిరుదు కూడా ఉంది. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఏ పార్టీ అధికారంలోకి రానుంది. ఏ స్థానం నుంచి ఎవరు ఎంత మెజారిటీతో గెలవబోతున్నారన్నది దాదాపు కరెక్ట్ గా చెబుతారు. ఇప్పుడు తన రీ-ఎంట్రీ విషయంలోనూ ఏ పార్టీలో చేరాలన్న దానిపై తనదైన శైలిలో సర్వే చేయించుకున్నారట. ఆ సర్వే టీడీపీని చూయించింది. దీంతో.. త్వరలోనే లగడపాటి టీడీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్దం అవుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ల‌గ‌డ‌పాటి చంద్రబాబును క‌లిసి చ‌ర్చలు జ‌రిపినట్టు చెబుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేయ‌నున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఈ మేరకు చంద్రబాబు పచ్చజెండా ఊపినట్టు చెబుతున్నారు. ప్రసుత్తం గుంటూరు ఎంపీగా రాయ‌పాటి ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. ఇటీవ‌ల రాయ‌పాటి టీడీపీపై అనుచిత వ్యాఖ్యలు చేయ‌డంతో చంద్రబాబు ఆయ‌న‌పై అసంతృప్తిగా ఉన్నట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అందుకే రాయ‌పాటికి చెక్ పెట్టేందుకే ల‌గ‌డ‌పాటిని గుంటూరు ఎంపీ సీటు ఖ‌రారు చేశార‌ని టాక్ కూడా వినిపిస్తోంది. మరీ.. సెకండ్ ఇన్నింగ్స్ లో లగడపాటి ఏ రేంజ్ లో దూసుకెళ్తారో చూడాలి.