రాజధాని నిర్మాణానికి సిద్ధమైన మాహిష్మతి రూపకర్త

SMTV Desk 2017-09-19 18:13:47  AP Capital City, S. S. Rajamouli, Chandrababu Naidu, Amaravati

హైదరాబాద్, సెప్టెంబర్ 19: మొదట నుండి రాజమౌళిని నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో పాలుపంచుకోమని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరుతున్న తరుణంలో జక్కన్న ఎట్టకేలకు ఇప్పుడు సుముఖత వ్యక్తం చేశారు. ఈ మేరకు రాజధాని నగరంలో శాసనసభ, హైకోర్టు నిర్మాణాల ఆకృతుల(డిజైన్ల)పై ప్రభుత్వంతో కలిసి రాజమౌళి పనిచేయనున్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ, సీఆర్‌డీఏ కమిషనర్‌ శ్రీధర్‌లు సోమవారం హైదరాబాద్‌లో రాజమౌళితో భేటీ అయ్యి రాజధాని డిజైన్లను ఆయనకు ఇచ్చారు. డిజైన్లపై తన బృందంతో కలిసి అధ్యయనం చేయనున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఈ నిర్మాణం కోసం తన వంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. లండన్‌లో ఉన్న నమూనాలు రూపొందించిన సంస్థ ప్రధాన కార్యాలయానికి జక్కన్నను తీసుకెళ్లి అక్కడి సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించనున్నారు. కాగా, లండన్ వెళ్లేందుకు ఆయన ఎలాంటి అభ్యంతరం తెలపలేదు. ఈ విషయమై రాజమౌళి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వారం రోజుల్లో కలవనున్నారు.