ముందస్తు ఎన్నికలకు ముందుగానే సిద్ధం కండి: బాబు

SMTV Desk 2017-09-05 12:20:00  chandhrabaabu, 2019 elections, ap elections, ap politics, tdp elections babu

అమరావతి సెప్టెంబర్ 5: ఈ సారి అసెంబ్లీ ఎన్నికలు 2019 లో కాకుండా ముందస్తు గానే ఉండే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఎన్నికలకు సర్వం సిద్ధంగా ఉండాలని, నాయకులంతా అందుకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మంగళగిరి లో తెదేపా నాయకత్వ శిక్షణ శిబిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు ప్రసంగిస్తూ..2018 డిసెంబర్ లో కూడా ఎన్నికలు వచ్చే అవకాశం లేకపోలేదని అన్నారు. ప్రజల ఆలోచనల్లో మార్పులకు అనుగుణంగా నాయకులు ఆలోచనా, ప్రవర్తనా విధానాలను కూడా మార్చుకోవాలని హితవు పలికారు. గెలుపు ఓటములు ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయని పేర్కొంటూ.. నంద్యాల ఎన్నికల ఫలితాలు కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రభావం చూపించాయని చెప్పారు. కార్యకర్తలు బాగా పనిచేశారని కితాబిచ్చారు. టెక్నాలజీ ని సరైన పద్దతిలో వాడుకుంటే వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని, 80 శాతం ప్రజలను సంతృప్తి పరిస్తే, అధికారం మన సొంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.