మంత్రి అనిల్‌ కుమార్‌ పర్యటనలో అపశ్రుతి

SMTV Desk 2019-11-29 17:22:50  

కర్నూలు జిల్లాలో మంత్రి అనిల్‌ కుమార్‌ పర్యటనలో అపశ్రుతి చోటు చేసుకుంది. మంత్రి బృందంపై తేనెటీగలు దాడి చేశాయి. పాములపాడు మండలం బానకచర్ల రెగ్యులేటర్‌ దగ్గర ఈ ఘటన జరిగింది. కర్నూలు జిల్లా పాములపాడు మండలం బానకచర్ల నీటి సముదాయాన్ని పరిశీలించేందుకు జల వనరుల శాఖ మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తో పాటు నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణిరెడ్డి తదితరులు వెళ్లారు. ఇంతలో అకస్మాత్తుగా తేనెటీగలు వారిపై దాడి చేసాయి. మంత్రితోపాటు ఉన్న ఎమ్మెల్యేలు వెంటనే అప్రమత్తమై కారులోకి వెళ్లి కూర్చోవడంతో క్షేమంగా బయటపడ్డారు.
ఈ దాడిలో ఎమ్మెల్యే ఆర్థర్‌ సహా కొంతమంది విలేకర్లకు తేనెటీగలు కుట్టాయి. ఆ సమయంలో మెట్లపై ఉన్న మంత్రి, ఎమ్మెల్యేలు వెంటనే కిందికి దిగి బయటకు వచ్చేశారు. ఈ సందర్భంగా కొంత తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి సహా మిగిలిన ఎమ్మెల్యేలందరూ అర్ధాంతరంగా పర్యటన ముగించుకుని వెళ్లిపోయారు.