బొత్సని బర్తరఫ్ చేయాలని డిమాండ్!

SMTV Desk 2019-11-26 12:05:06  

ఏపీ మంత్రి బొత్స ఏపీ రాజధాని అమరావతిపై చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి యనమల మండిపడ్డారు. రాజధానిపై మంత్రి బొత్స వ్యాఖ్యలను దారుణమని.. రాష్ట్ర రాజధానిని స్మశానంతో పోల్చడం ఏంటని ప్రశ్నించారు. ప్రజా దేవాలయం వంటి శాసన సభను శ్మశానంతో పోలుస్తారా.. న్యాయ దేవాలయం హైకోర్టును శ్మశానంతో పోలుస్తారా.. సచివాలయం వీళ్ల కళ్లకు శ్మశానంలా కనిపిస్తోందా అంటూ మండిపడ్డారు. అమరావతిలో 29గ్రామాలను స్మశానంతో పోలుస్తారా.. 34వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాలను అవహేళన చేయడం దారుణమన్నారు.సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ఎక్కడ కూర్చుంటున్నారని ప్రశ్నించారు యనమల. శ్మశానంలోనే రోజూ కూర్చుంటున్నారా.. వీరంతా పరిపాలన ఎక్కడ నుంచి చేస్తున్నారు.. శ్మశానంలో కూర్చుని పాలన చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. దేవేంద్రుడి రాజధాని అమరావతిగా చరిత్ర చెబుతోందని.. ప్రధాని మోదీ మన అమరావతికి శంకుస్థాపన చేసిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నించారు.అమరావతిలో పుణ్యనదులు, పుణ్యక్షేత్రాల మట్టితో శంకుస్థాపన చేశామని.. దేశ, విదేశీ ప్రతినిధులంతా అమరావతి శంకుస్థాపనకు హాజరయ్యారని గుర్తు చేశారు. కేంద్రం కొత్తగా విడుదల చేసిన ఇండియా మ్యాప్‌లో అమరావతిని చూపకపోతే.. టీడీపీ ఎంపీలు లోకసభలో పట్టుబట్టి సాధించారని.. రాజధానిగా అమరావతిని గుర్తిస్తున్నామని గడ్కరీయే చెప్పారన్నారు.వైఎస్సార్‌సీపీ నేతలు అమరావతిని అభివృద్ది చేయకపోగా అవమానించడం సరికాదన్నారు యనమల. చట్టసభలను అవమానించినందుకు ప్రివిలేజ్ నోటీసు ఇస్తామని.. రాజధాని ప్రజలనే కాదు, యావత్ రాష్ట్ర ప్రజలను మంత్రి బొత్స అవమానించారన్నారు. మంత్రిగా ఉండే అర్హతను ఆయన కోల్పోయారని.. బొత్సను వెంటనే మంత్రి పదవినుంచి బర్తరఫ్ చేయాలన్నారు.. లేకపోతే శ్మశానం వ్యాఖ్యల వెనుక సీఎం జగన్ ప్రోద్భలం ఉన్నట్లే భావిస్తామన్నారు.