మద్యం మత్తు.. ఆ పై రాంగ్ రూట్‌లో ర్యాష్‌ డ్రైవింగ్‌..ఒకరు మృతి

SMTV Desk 2019-11-25 11:58:06  

మద్యం మత్తు.. ఆ పై రాంగ్ రూట్‌లో ర్యాష్‌ డ్రైవింగ్‌ చేసి ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాడో దుర్మార్గుడు. హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ వద్ద ఖరీదైన కారు బీభత్సం సృష్టించింది. అర్ధరాత్రి వేళ రాంగ్‌రూట్‌లో కారులో వేగంగా దూసుకొచ్చిన యువకుడు ఎదురుగా వస్తున్న బుల్లెట్‌ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో బైక్‌ నడుపుతున్న ఆనంద్‌ అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందగా.. వెనక కూర్చున్న యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను స్ధానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన, కారు నడుపుతున్నఅశ్విన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను మద్యం మత్తులో ఉన్నట్టు తేలింది. కారులో మరో ఇద్దరు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే వారి పూర్తి వివరాలు తెలియలేదు.


ఓవైపు డ్రంకెన్‌ డ్రైవ్‌ రెయిడింగ్స్‌ జరుగుతున్నా... మత్తుబాబుల్లో మార్పు రావడం లేదు. పీకల్దాకా తాగి... ఇష్టానుసారంగా డ్రైవ్‌ చేసి ఇలా ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఖరీదైన కారులో ఒళ్లు తెలియని మత్తులో మితిమీరిన వేగంతో వచ్చి బైక్‌ మీద వెళ్తున్న జంటను హైటెక్‌సిటీ నోవాటెల్‌ సమీపంలో ఇలాగే ఢీకొట్టారు. గతంలో ఇలాంటి సంఘటనలు హైద్రాబాద్‌లో ఎన్నో జరిగాయి. ఆ జాబితాలోకి తాజా ప్రమాదం చేరింది. ఇలాంటి తాగుబోతుల కారణంగా చేయని తప్పునకు అమాయకులు బలైపోతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని నగరవాసులు కోరుతున్నారు.