ఫ్రెంచ్ కిస్‌‌తో కొత్త రోగం!

SMTV Desk 2019-11-16 14:13:19  

ఎవరైనా ప్రేమను తెలిపేందుకు ముద్దుపెట్టుకోవడం చేస్తుంటారు. అయితే, ఇలా చేయడం వల్ల గనేరియా వ్యాధి వస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతీ ఏడాదికి 78 మిలియన్ల మందికి గనేరియా సంక్రమిస్తుంది. ఈ వ్యాధి ఇప్పటివరకూ సురక్షితం కాని సెక్స్ వల్ల వస్తుందని తెలుసు. కానీ, తాజాగా ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా వస్తుందని తేలింది. ముద్దు అనేది ప్రేమకు ఓ నిర్వచనం అంటారు. ముద్దులాడడం, ముద్దు పెట్టుకోవడం అనేది కేవలం కోరికలను మాత్రమే కాదు.. ప్రేమ, ఇష్టాన్ని కూడా తెలుపుతుంది. ఈ ముద్దుల్లోనూ చాలా రకాలు ఉన్నాయి. రెండు బంధాలను కలిపే ఈ సొగసైన ప్రక్రియ కోసం భార్యభర్తలు, ప్రేమికులు తహతహలాడతారు. ఇది కేవలం సెక్స్‌ చేసేందుకు మాత్రమే ముందడుగు అని అనుకుంటే పొరపాటే.. చుంభనం అనేది మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కూడా పెంపొందిస్తుంది అని ఎన్నో పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, ఈ ముద్దుల్లోనూ అనేక రకాలు ఉంటాయి. ఇందులో ఫ్రెంచ్ కిస్ ఒకటి. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కోరుకునే పార్టనర్‌తో ఈ కిస్ చేసేందుకు ఆరాటపడతారు కూడా. అయితే, ఈ ముద్దుని పెట్టుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. ముఖ్యంగా గనేరియా వంటి సుఖవ్యాధులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆస్ట్రేలియా మోనాష్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు.. కొన్ని రోజులుగా పరిశోధనలు జరిపి ఈ విషయాన్ని వెల్లడించారు. ముద్దులు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలు, నష్టాలు ఏంటి అన్న అంశంపై పరిశోధన జరిపిన వారు… ఈ విషయాన్ని వెల్లడించారు. అనారోగ్యకరమైన లైంగిక సంబంధాలతో గనేరియా వస్తుందని వెల్లడించారు. అయితే, ఫ్రెంచ్ కిస్ చేయడం వల్ల ఈ వ్యాధి వస్తుందని తెలిపారు.. కొన్ని నెలలుగా లైంగిక చర్యలో పాల్గొనకుండా ఉన్న వ్యక్తులకు కూడా గనేరియా రావడంతో కేవలం ముద్దు పెట్టుకోవడం ద్వారానే ఈ సమస్య వస్తుందని గుర్తించినట్లు తెలిపారు. ఈ వ్యాధి సోకితే గొంతు, రక్తంపై తీవ్ర ప్రభావం చూపి మరో ఐదు అదనపు వ్యాధులకు కూడా దారి తీస్తుందని తెలిపారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లైంగిక చర్యలు తెలియని వారితో చేయడం సరికాదని చెబుతున్నారు. గనేరియా వ్యాధి వేగంగా విస్తరిస్తోంది.. ఇది ఎలా సంక్రమిస్తుందో తెలుసుకోవడంతో పాటు.. దీన్ని నియంత్రించే వాటి గురించి కూడా తెలుసుకోవడం చాలా ముఖ్యం. అని మోనాష్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ చెబుతున్నారు. తెలియని వారితో సెక్స్, రొమాన్స్ చేసే ముందు ఆలోచించాలని, తగని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. కేవలం గనేరియా ఒక్కటే కాదు.. సురక్షితం కానీ లైంగిక కార్యక్రమాల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ముద్దు పెట్టుకోవడం వల్ల కూడా చాలా రకాలైన అంటువ్యాధిలు సోకే అవకాశం ఉంది. ఎందుకంటే వ్యాధులకు కారణమైన బ్యాక్టీరియా, వైరస్‌లు లాలా జలం ద్వారా ఒకరి శరీరం నుంచి మరో శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఈ కారణంగా అనేక సమస్యలు వస్తాయి. దీనిని ప్రతీ ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ముద్దు వల్ల ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే.. ఎప్పటికప్పుడూ యాంటీ బ్యాక్టీరియల్ మౌత్ వాష్ వంటి వాటిని వాడాలని చెబుతున్నారు వైద్యులు. వ్యక్తిగత శుభ్రత చాలా ముఖ్యం. ఈ కారణంగా ఎలాంటి అనారోగ్య సమస్యలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించవు. ముద్దు అంటే అదేదో భూతు కాదు.. ఇది ఓ రకమైన ఎక్స్‌ప్రెషన్.. ముద్దు వల్ల కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. కిస్ చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా బెనిఫిట్స్ ఉన్నాయి. చాలా మంది అనేక కారణాల వల్ల ఒత్తిడిగా ఫీల్ అవుతుంటారు. ఇబ్బందిగా ఫీల్ అవుతుంటారు. అలాంటప్పుడు కౌగిలింతలు, ముద్దులు చాలా వరకూ రిలీఫ్ ఇస్తాయి. ముద్దుకి ఇంత ప్రాముఖ్యత ఉంది కాబట్టే.. చాలా మంది కవులు కూడా దీనిపై ఎన్నో పాటలు రాశారు.. మన దగ్గర ఇంకా అంతా లేదు కానీ, పాశ్చాత్య దేశాల్లో మాత్రం ముద్దు అనేది ఓ పలకరింత.. వారు ఎవరినైనా దాదాపు అలానే పలకరిస్తారు.