విజయరెడ్డి సజీవదహనం... సురేశ్ పరిస్థితి కూడా విషమం!

SMTV Desk 2019-11-06 13:14:03  

అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయరెడ్డిని సజీవదహనం చేసిన తరువాత సురేశ్ కూడా పెట్రోల్ పోసుకొని ఒంటికి నిప్పుపెట్టుకొని తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సురేశ్ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శరీరం కాలిపోవడం వలన చర్మం సెప్టిక్ అయ్యే ప్రమాదం ఉందని, అలాగే ఒంట్లో నీరు అంతా పోయిందని వైద్యులు చెప్పారు. అతనిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పారు. కానీ ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని మరొక 72 గంటలు గడిస్తేగానీ అతను కోలుకోగలడో లేదో చెప్పడం కష్టమని వైద్యులు చెప్పారు.

తహశీల్దార్ విజయరెడ్డిని కాపాడే ప్రయత్నంలో ఆమె డ్రైవర్ గురునాథం, అటెండర్ చంద్రయ్య కూడా తీవ్రంగా గాయపడగా వారిలో డ్రైవర్ గురునాథం మంగళవారం అపోలో ఆసుపత్రిలో మరణించారు. 50 శాతం గాయాల పాలైన చంద్రయ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

ఈ హత్య కేసుపై వనస్థలిపురం ఏసీపీ జయరాం విచారణ జరుపుతున్నారు. తహశీల్దార్ విజయరెడ్డిని చంపాలనే ఉద్దేశ్యంతోనే పెట్రోల్ డబ్బా వెంట తెచ్చుకొన్నానని సురేశ్ పోలీసులకు వాంగ్మూలం ఇవ్వడంతో ఇదేదో క్షణికావేశంతో చేసిన పని కాదని స్పష్టమయింది. పోలీసులు అతనిపై పలు సెక్షన్స్ క్రింద కేసు నమోదు చేశారు. తహశీల్దార్ విజయరెడ్డిని హత్య చేసే ముందు అతను తన పెద్దనాన్న దుర్గయ్యతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు కాల్ డాటా ద్వారా గుర్తించారు. కనుక దుర్గయ్యను, సురేశ్ తండ్రి కృష్ణను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

సురేశ్‌కు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించడంతో ఈ హత్య వెనుక వారి ప్రమేయం కూడా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. కానీ ఇంతవరకు రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు. వారి ప్రమేయం ఉన్నట్లు కనుగొంటే తప్పకుండా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెపుతున్నారు.

తహశీల్దార్ విజయరెడ్డి హత్య వెనుక తెరాసకు చెందిన కొందరు నేతలు, ఒక ప్రజాప్రతినిధి హస్తం ఉందనే సమాచారం తనకు అందిందని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కనుక ఈ కేసుపై తెరాస-కాంగ్రెస్‌, బిజెపిల మద్య రాజకీయయుద్ధంగా మారే అవకాశం కూడా ఉంది.