108,104 ఉద్యోగులకు శుభవార్త

SMTV Desk 2019-11-01 15:25:27  

ఆంధ్రప్రదేశ్ లోని 108,104 ఉద్యోగులకు రాష్ట్ర సర్కార్ శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తాడేపల్లి సీఎంను కలిసిన 108, 104 ఉద్యోగ సంఘాల ప్రతినిధులు.. వేతనాల పెంచాలని కోరారు. వారి విన్నపంపై సానుకూలంగా స్పందించిన జగన్.. జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు.. సీఎం నిర్ణయంపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. తమ సమస్యపై సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 108 వాహనాల్లో పనిచేస్తున్న వారు 2వేలమందికిపైగా ఉన్నారు. వీరిలో డ్రైవర్‌కు ప్రస్తుతం రూ.13 వేల జీతం ఇస్తుండగా.. దాన్ని రూ.28 వేలకు.. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌కి ప్రస్తుతం రూ.15 వేలు ఇస్తుంటే.. దాన్ని రూ.30 వేలకు పెంచేందుకు సీఎం హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తెలిపారు. 104 వాహనాల విషయానికి వస్తే.. 1,500 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో ఫార్మసిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్లకు రూ.17,500 చొప్పున జీతం ఉంటే.. రూ.28 వేలకు, డ్రైవర్‌కు రూ.15,000 వేతనం ఇస్తుంటే.. దానిని రూ.26 వేలకు పెంచేందుకు జగన్‌ హామీ ఇచ్చారట. ఎన్నో ఏళ్లుగా జీతాల పెంపు కోసం పోరాటం చేస్తున్నామని.. ఇప్పటికి ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా స్పందించి జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారన్నారు. ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఉద్యోగులందర్ని ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ పరిధిలో పనిచేసే విధంగా చేస్తామని సీఎం చెప్పారని తెలిపారు. రాబోయే రోజుల్లో 108,104 వాహనాల ద్వారా మరింత మెరుగ్గా సేవలందించేందుకు కృషి చేస్తామన్నారు.