కాకినాడ నూతన మేయర్ ఎవరు?

SMTV Desk 2017-09-01 12:56:04  Kakinada, Corporation, mayor, TDP, AP chief minister, Kakinada present mayor

కాకినాడ, సెప్టెంబర్ 1: కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆ పార్టీ వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇటు కాకినాడ నుండి అటు అమరావతి వరకు టీడీపీ శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. కాగా, కాకినాడ కార్పొరేషన్‌లో మేయర్‌ని ఎన్నుకోవడానికి అవసరమైనన్ని డివిజన్లలో తెదేపా స్వతహాగా విజయం సాధించింది. ఈ నేపధ్యంలో మేయర్ పదవిని ఎవరు చేపట్టనున్నారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అక్కడి పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మేయర్ బరిలో శేషకుమారి, అడ్డూరి లక్ష్మి, సుంకర పావని, సుంకర శివప్రసన్న ఉన్నట్లు తెలుస్తుంది. అయితే మేయర్ ఎంపిక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తుది నిర్ణయం మేరకు లోబడి ఉంటుంది. కాగా, గతంలో మేయర్ పదవిని కాపు వర్గానికే కేటాయిస్తామంటూ అధిష్టానం వెల్లడించింది. కాపు సామాజిక వర్గానికే చెందిన వ్యక్తికే మేయర్ పదవి కేటాయిస్తారా? లేదా? అనేది వేచి చూడాలి.