ఇంత మంచి భర్త నాకొద్దు బాబోయ్!!

SMTV Desk 2019-10-17 15:06:30  

అరబ్ వివాహిత ఓ వింత కారణంతో భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుమెట్లెక్కిన ఘటన దుబాయ్‌లో వెలుగులోకి వచ్చింది. తన భర్త సున్నిత మనస్తత్వం తనకు నచ్చడం లేదని, అందుకే విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే... ఈజిప్ట్‌కు చెందిన మహిళ 12 ఏళ్ల క్రితం అరబ్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. దంపతులిద్దరూ ఒకే స్కూల్‌లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు సంతానం.

11 ఏళ్ల కొడుకు, 8 ఏళ్ల కూతురు. భర్తకు ఏ చేడు అలవాట్లు లేవు. ఇళ్లు, కుటుంబం, ఉద్యోగం తప్పిస్తే అతడికి వేరే ప్రపంచమే తెలియదు. అయినా ఆమె తనకు ఈ భర్త వద్దు అని 12 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలికేందుకు కోర్టుమెట్లెక్కింది. పైగా కోర్టులో తన భర్త చాలా మంచోడు, ఏ చేడు అలవాట్లు లేవు. కానీ అతడి బలహీనమైన వ్యక్తిత్వం కారణంగానే తాను విడాకులు కోరుతున్నట్లు చెప్పుకొచ్చింది.

అతడి సున్నితమైన ప్రవర్తన కారణంగా చివరకు పిల్లలు కూడా ఆయన మాట వినడం లేదు. మీ ప్రవర్తనను మార్చుకొని పిల్లల దగ్గర కొంచెం కఠినంగా ఉండాలని చెప్పిన ఫలితం లేదు. చివరకు తాము పనిచేసే స్కూల్‌లో కూడా ఇదే పరిస్థితి. ఏకంగా ఆయన పాఠాలు బోధించే విద్యార్థులు కూడా ఆయన్ని గేలి చేస్తుంటారు. ఇక తోటి ఉద్యోగుల మాట సరేసరి. ఇవన్నీ చూస్తుంటే తనకు భవిష్యత్తులో భర్తతో కలిసి ఉండడం అంతమంచిది కాదనిపిస్తోంది. పిల్లలు కూడా నాన్న ఇలా ఉంటే ఎలా అమ్మ అని తన వద్ద వాపోతుంటారని తెలిపింది.

ఇదిలాఉంటే అప్పటికే భర్త ప్రవర్తనతో విసిగిపోయిన భార్యకు ఇటీవల ఆయన తండ్రి పంచిపెట్టిన వారసత్వ సంపద విషయంలో అతడు ప్రవర్తించిన తీరు మరింత విస్మయానికి గురి చేసింది. ఆ సంపదలో తనకు చిల్లిగవ్వ వద్దని, మొత్తం పెళ్లికాని తన సోదరుడికే ఇచ్చేయమని భర్త చెప్పడం విని ఆమె షాకైంది. ఇక అప్పటి నుంచి ఈ దంపతుల మధ్య గొడవలు ఇంకా ఎక్కువ అయ్యాయి. మీకు వద్దు కాని మీ పిల్లలు ఉన్నారు కదా. వారి పరిస్థితి ఏంటి అని భార్య అతడ్ని ప్రశ్నించిడం మొదలెట్టింది. ఇలా ప్రతి విషయంలో భర్త సున్నిత మనస్తత్వంతో వ్యవహారించడం ఆమెకు నచ్చడం లేదు. దాంతో చేసేదేమీలేక భర్త నుంచి విడాకులు కోరుతూ కోర్టుమెట్లెక్కింది.