'వైయస్సార్ రైతు భరోసా' పథకం పేరు మార్చిన ఏపీ ప్రభుత్వం

SMTV Desk 2019-10-15 11:27:13  

రైతు భరోసా పథకాన్ని ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తోంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభంకానుంది. తొలుత ఈ పథకానికి వైయస్సార్ రైతు భరోసా అనే పేరు పెట్టినప్పటికీ... తాజాగా వైయస్సార్ రైతు భరోసా-పీఎం కిసాన్ సమ్మాన్ గా పేరును మార్చారు. ఈ నేపథ్యంలో, రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి అభినందనలు తెలిపారు.

ఈ పథకానికి కేంద్ర నిధులను కూడా వినియోగిస్తున్న నేపథ్యంలో... పథకం పేరును మార్చడం పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నానని విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో గత ప్రభుత్వం గొడవ పడటం వల్లే రాష్ట్రం నష్టపోయిందని చెప్పారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. సమైఖ్య స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిందేనని చెప్పారు.

మరోవైపు, రైతు భరోసా కింద రైతులకు పెట్టుబడి సాయాన్ని రూ. 12,500 నుంచి రూ. 13,500కు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. నాలుగేళ్లలో రూ. 50 వేలు ఇస్తామని తొలుత ప్రకటించినప్పటికీ... దాన్ని ఐదేళ్లకు పెంచుతూ రూ. 67,500 ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించింది.