రూ. 750 కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటూ... రూ. 7500 కోట్ల నష్టాన్ని తెచ్చారు!!

SMTV Desk 2019-09-26 17:56:45  

పోలవరం ప్రాజెక్టులో దోపిడీకి వైసీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా రూ. 750 కోట్లు ఆదా చేశామని చెప్పుకుంటూ... రూ. 7500 కోట్ల నష్టాన్ని చేకూర్చారని చెప్పారు. పోలవరం పనులకు గతంలో ఎక్కువ కోట్ చేసిన మేఘా సంస్థే ఇప్పుడు తక్కువ ధరను కోట్ చేసిందని తెలిపారు. ఎలెక్ట్రిక్ బస్సులకు సంబంధించి క్విడ్ ప్రోకోలో భాగంగానే ఇది జరిగిందని ఆరోపించారు. మేఘా కంపెనీకి ఎలక్ట్రిక్ బస్సులు ఇచ్చేందుకు నిబంధనలు ఒప్పుకోవంటూ సురేంద్రబాబు అడ్డుపడితే... ఆర్టీసీ ఎండీ పదవి నుంచి ఆయనను తప్పించారని విమర్శించారు. గోదావరిలో మునిగిన బోటును ఇంతవరకు తీయలేకపోయారని... ఓ ప్రైవేటు సంస్థ ముందుకు వచ్చినా, దానికి అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. తిరుమలను వివాదాలకు కేంద్రంగా మార్చారని చెప్పారు. అన్నింటిపై పోరాడుదామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.