ఆ టైం లో ఏటీఎం విత్‌డ్రాయెల్స్‌ చేసుకోరాదు ...

SMTV Desk 2019-08-27 11:51:00  

ఎప్పుడుపడితే అప్పుడు ఏటీఎంకు వెళ్లి డబ్బులు తీసుకునే వెసులుబాటు అందుబాటులో ఉండకపోవచ్చు. బ్యాంక్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఢిల్లీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) అందుబాటులోని పరిష్కార మార్గాలను తెలియజేసింది. ఇందులో ఏటీఎం విత్‌డ్రాయెల్స్‌పై పరిమితి విధింపు కూడా ఒకటి. ఇందులో రెండు ఏటీఎం లావాదేవీల మధ్య 6-12 గంటల గ్యాప్ ఉంటుంది.

‘చాలా వరకు మోసాలు రాత్రి పూట జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచి తెరవారుజామున బ్యాంక్ మోసాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో లావాదేవీలను క్యాన్సిల్ చేస్తే ప్రయోజనం ఉండొచ్చు’ అని ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ ఎండీ, సీఈవో ముకేశ్ కుమార్ తెలిపారు.

ఈ ప్రతిపాదన ఓకే అయితే కస్టమర్లు ఏటీఎం నుంచి డబ్బులు నిర్ణీత సమయంలో తీసుకోవడానికి వీలుండదు. 2018-19లో ఢిల్లీలో 179 ఏటీఎం మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. దేశంలో మహరాష్ట్ర (233 కేసులు) తర్వాత ఢిల్లీలోనే ఈ స్థాయిలో ఎక్కువగా మోసాలు జరిగాయి. ఏటీఎం మోసాల్లో మహరాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానం ఢిల్లీది.

కార్డుల క్లోనింగ్ ఇటీవల కాలంలో ఎక్కువైంది. ఏటీఎం మోసాలకు పాల్పడే వారిలో విదేశీయులు ఎక్కువగా ఉన్నారు. 2018-19లో దేశవ్యాప్తంగా 980 మోసాలు నమోదయ్యాయి. దీనికన్నా ముందు ఏడాదిలో ఈ కేసుల సంఖ్య 911గా ఉంది.

బ్యాంకర్లు మోసాలు అడ్డుకునేందుకు పలు చర్యలు ప్రకటించారు. వన్ టైమ్ పాస్‌వర్డ్‌తో ఏటీఎం విత్‌డ్రాయెల్స్ విధానం కూడా ఒకటి. ఇక్కడ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవాలంటే ఓటీపీ అవసరం అవుతుంది. ఇది క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు ద్వారా నిర్వహించే ఆన్‌లైన్ లావాదేవీలను పోలి ఉంది.

అలాగే బ్యాంకర్లు కమ్యూనికేషన్ ఫీచర్‌తో కూడిన ఏటీఎంలకు సెంట్రలైజ్‌డ్ మానిటరింగ్ వ్యవస్థ గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఎస్‌బీఐ సహా పలు బ్యాంకులు ఇప్పటికే ఈ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇందులో ఎవరైనా హెల్మెట్ పెట్టుకొని ఏటీఎం సెంటర్‌లోకి వెళ్తే.. హెల్మెట్ తీయండి అంటూ వాయిస్ వినిపిస్తుంది. కెమెరా అతనిపై కన్నేసి ఉంచుతుంది.

ప్రస్తుతం ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్‌కు చెందిన 300 ఏటీఎంలలో ఈ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యాంక్ కేంద్ర కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ ఈ బాధ్యతలు చూసుకుంటుంది. అయితే అన్ని బ్యాంకుల ఏటీఎంలలో ఈ సదుపాయం అందుబాటులో లేదు. త్వరలోనే బ్యాంకులన్నీ ఈ వ్యవస్థను ఏర్పాటు చేయొచ్చు.