దేశీయ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి

SMTV Desk 2019-11-30 16:26:52  

ముంబయి: గత రెండు రోజులుగా సరికొత్త రికార్డుల్లో పరుగుల తీస్తున్న దేశీయ మార్కెట్లు శుక్రవారం చతికిల పడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలు, శుక్రవారం సాయంత్రం వెలువడనున్న జిడిపి గణాంకాలపై భయాందోళనలు, దిగ్గజ కంపెనీల షేర్లలో అమ్మకాలు… వెరశి మార్కెట్లను కుదేలు చేశాయి. దీంతో శుక్రవారం ట్రేడింగ్‌లో ప్రధాన సూచీలు భారీ నష్టాలను చవి చేశాయి. బాంబే స్టాక్ ఎప్స్‌చేంజి సూచీ సెన్సెక్స్ 41 వేల పాయింట్ల దిగువకు పడిపోగా, నిఫ్టీ సైతం దాదాపు 100 పాయింట్లు నష్టాపోయింది. శుక్రవారం ఉదయం స్వల్ప నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ రిలయన్స్, ఇన్ఫోసిస్, ఐసిఐసిఐ బ్యాంక్‌లాంటి దిగ్గజ సంస్థల షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలతో కాస్సేపటికే మరింత దిగజారాయి.

ఒకానొక దశలో సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమైంది. నిఫ్టీ కూడా 12,500 పాయింట్ల దిగువన ట్రేడ్ అయింది. అయితే చివరి గంటల్లో కొన్ని రంగాలకు చెందిన షేర్లలో కొనుగోళ్ల కారణంగా కాస్త కుదుటపడ్డ సూచీలు నష్టాలను కొంతమేరకు తగ్గించుకోగలిగాయి. అయినా సెన్సెక్స్ 336 పాయింట్లు నష్టపోయి 40,479 పాయింట్ల వద్ద, నిఫ్టీ 95 పాయింట్ల నష్టంతో 12,056 పాయింట్ల వద్ద స్థిరపడ్డాయి. లోహ, ఆటోమొబైల్, ఫార్మా, బ్యాంకింగ్, ఐటి సహా దాదాపు అన్ని రంగాల షేర్లు కుదేలయ్యాయి. శుక్రవారం వెలవడనున్న త్రైమాసిక జిడిపి వృద్ధి 5 శాతం లోపే ఉండవచ్చన్న భయాందోళనలకు తోడు, ఇటీవలి కాలంలో భారీగా పెరిగిన రంగాల షేర్లలో లాభాల స్వీకరణ మార్కెట్ల పతనానికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.