కేటీఆర్‌కు ఇప్పుడు నైతికవిలువలు గుర్తులేవా?

SMTV Desk 2019-06-08 18:59:09  Utham kumar, ktr,

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసుకోవడాన్ని, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరును నిరసిస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష పేరిట ఈరోజు ఉదయం 10.30 గంటల నుంచి రేపు సాయంత్రం 5.30 గంటల వరకు ఇందిరాపార్కులో దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్షలో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్-ఛార్జ్ రాంచంద్ర కుంతియా, శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తదితర ముఖ్యనేతలు అందరూ పాల్గొననున్నారు. తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, టిటిడిపి అధ్యక్షుడు ఎల్ రమణ, వామపక్ష నేతలు, ప్రజాగాయకుడు గద్దర్, విమలక్క, సామాజికవేత్త కంచె ఐలయ్య తదితరులు వారికి సంఘీభావం తెలుపనున్నారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలో విలీనం చేసి పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పీకరు పదవికి తీరని అప్రదిష్ట తెచ్చారు. స్పీకరు పదవిలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ రాజ్యాంగాన్ని కాపాడవలసిన ఆయన, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై మా అభ్యంతరాలను పట్టించుకోకుండా స్పీకరు తెరాస ప్రతినిధిలా వ్యవహరించారు. రోజూ నైతికవిలువలు గురించి మాట్లాడే తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఇప్పుడు నైతికవిలువలు గుర్తులేవా? ఆయనకు దమ్ముంటే తక్షణం 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేత వారి పదవులకు రాజీనామాలు చేయించి ఉపఎన్నికలలో తెరాస అభ్యర్ధులుగా పోటీ చేయించి మళ్ళీ గెలిపించుకోవాలి.

రాజ్యాంగాన్ని కాపాడవలసిన గవర్నర్‌ నరసింహన్‌, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇద్దరూ ఈ అనైతిక ఫిరాయింపులను పట్టించుకోకపోవడం చాలా బాధాకరం. కనుక మేము మళ్ళీ ఈ సమస్యపై సోమవారం హైకోర్టులో మరో పిటిషన్‌ వేసి తెరాసతో న్యాయపోరాటం చేస్తాము. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఎటువంటి ప్రలోభాలకు తలొగ్గారో వివరాలు సేకరించి త్వరలో లోక్‌పాల్‌కు కూడా ఫిర్యాదు చేస్తాము. దీనిపై మేము తీవ్రస్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమించబోతున్నాము,” అని అన్నారు.

ఈ వ్యవహారంపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయించబోతున్నట్లు సీనియర్ కాంగ్రెస్‌ నేత షబ్బీర్ అలీ సిఎం కేసీఆర్‌ను హెచ్చరించారు. ఈ వ్యవహారాన్ని లోక్‌సభలో లేవనెత్తి జాతీయస్థాయిలో అన్ని పార్టీల మద్దతు కూడగడతామని ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రేవంత్‌ రెడ్డి అన్నారు. అసెంబ్లీ తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు వినపడకూడదనే దురుదేశ్యంతోనే సిఎం కేసీఆర్‌ ఇటువంటి అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని కుంతియా అన్నారు.