బ్రిటన్ లో ట్రంప్ కు నిరసనల సెగలు!

SMTV Desk 2019-06-06 12:30:10  donald trump, britain

లండన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం బ్రిటన్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఆయనకు అక్కడ నిరసనల సెగ తగిలింది. ట్రంప్‌ పర్యటన నేపథ్యంలో నిరసనలను అడ్డుకునేందుకు రాజధాని లండన్‌ నగరంలో, ముఖ్యంగా బకింగ్‌హాం ప్యాలెస్‌, రిజెంట్‌ పార్క్‌లో వున్న అమెరికా దౌత్య కార్యాలయం వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. ఎలిజెబెత్‌ రాణి లండన్‌లోని తన నివాసంలో భారీగా ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంతో ట్రంప్‌ తొలిరోజు పర్యటన ముగిసింది. బ్రిటన్‌తో అమెరికా సంబంధాలకు తాను అగ్ర ప్రాధాన్యతనిస్తున్నట్టు ట్రంప్‌ తన సోషల్‌ మీడియా సైట్‌లో పెట్టిన ఒక సందేశంలో పేర్కొన్నారు. బ్రిటన్‌ త్వరలో ఐరోపా కూటమి నుంచి విడిపోతున్న నేపథ్యంలో తాము ఆ దేశంతో భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉందని ట్రంప్‌ తెలిపారు. ఎలిజెబెత్‌ రాణి ఆతిథ్యం ఇచ్చిన విందు కార్యక్రమానికి కొద్ది ముందు ప్రతిపక్ష లేబర్‌ పార్టీ నేత జెరిమీ కార్బిన్‌ ఒక ప్రకటన చేస్తూ మంగళవారం నాడు ట్రఫాల్గర్‌ స్క్వేర్‌లో ట్రంప్‌ వ్యతిరేక ర్యాలీని నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. ట్రంప్‌కు ఇస్తున్న విందు కార్యక్రమానికి హాజరు కావల్సిందిగా స్పీకర్‌ విన్స్‌ కేబుల్‌ పంపిన ఆహ్వానాన్ని ఆయన తిరస్కరించారు. మంగళవారం నాటి ట్రంప్‌ వ్యతిరేక ర్యాలీలో దాదాపు 2.5 లక్షల మంది ప్రజలు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు.