ముఖ్యమంత్రికి లేఖ రాసిన బాబు

SMTV Desk 2019-06-05 16:28:21  Jagan, Cm, CBN,

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి అనుబంధంగా ఉన్న ప్రజా వేదికను ప్రతిపక్ష నేత అధికారిక నివాసంగా కేటాయించాలని తెలుగుదేశం పార్టీ కోరనుందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. నిన్న తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుతో పార్టీ నాయకులు సమావేశమైన వేళ, పార్టీ నేతల సూచనతో ప్రజా వేదికను తమకు ఇవ్వాలని ప్రభుత్వానికి లేఖ రాయాలని నిర్ణయించారు. నిర్ణయించిన మేరకు ఈరోజు కొద్దిసేపటి క్రితం చంద్రబాబు జగన్ కు లేఖ వ్రాసారు.

ప్రస్తుతం కృష్ణ కరకట్ట పక్కనే చంద్రబాబు నివాసం ఉన్న సంగతి తెలిసిందే. అయితే తన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక భవనాన్ని ప్రతిపక్ష నేత నివాసానికి అనుబంధంగా గుర్తించాలని ఆ లేఖలో కోరారు. పార్టీ అధినేతగా తనను కలిసేందుకు అనేకమంది వస్తుంటారని అందువల్ల వారికి ఇబ్బంది కలగకుండా ఈ భవనాన్ని తమకే కేటాయించాలని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు. అయితే మరోపక్క గుంటూరులో పార్టీ కార్యాలయం అందరికీ అందుబాటులో లేదని భావించిన చంద్రబాబు, విజయవాడలో మరో మంచి భవంతిని ఎంపిక చేయాలని కేశినేని నాని, దేవినేని ఉమలను ఆదేశించారు.