ఇద్దరు వ్యాపారవేత్తలు నన్ను మోసం చేసారు

SMTV Desk 2019-06-05 15:35:56  Ravi Prakash, TV9

ఇప్పటిదాకా అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ ఎట్టకేలకు సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారన్న సంగతి తెలిసిందే. నకిలీ పత్రాలు, ఫోర్జరీ పత్రాలు సృష్టించారని ఆరోపిస్తూ అలంద మీడియా ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. 41ఏ సీఆర్పీసీ కింద విచారణకు హాజరు కావాలని ఇది వరకే ఆయనకు సైబరాబాద్‌ పోలీసులు నోటీసులు జారీచేసినా రవిప్రకాశ్‌ హాజరుకాలేదు. చివరకు నిన్న సీసీఎస్ పోలీసుల ఎదుట హజరయ్యారు రవి ప్రకాష్. దాదాపు 5 గంటల పాటు విచారించిన పోలీసులు రేపు మరోసారి విచారణకు హాజరు కావాలని రవి ప్రకాష్‌కు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. విచారణ అనంతరం రవి ప్రకాశ్ మీడియాతో మాట్లాడుతూ హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారవేత్తలు నన్ను మోసగించారు,

టీవీ9ను అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపించారు. ఈ వివరాలను పోలీసులకు తెలిపానని అన్నారు. టీవీ9ను అక్రమంగా స్వాధీనం చేసిన విషయం వెలుగులోకి రాకుండా ఉండటం కోసం. దొంగ బోర్డు మీటింగులు పెట్టిన విషయం బయటకు రాకుండా ఉండటం కోసం తన మీద 3 దొంగ కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఒక వ్యక్తిగా ధనికస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తాను పోరాడుతున్నానని మాఫియా మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకొని వాస్తవాలను బయటకు రాకుండా కుట్ర పన్నుతున్నాయని, దానికి వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న కారణంగానే నాపై అక్రమ కేసులు నమోదు చేశారని రవి ప్రకాష్ ఆరోపించారు. తన చివరి రక్తపు బొట్టు వరకు వాస్తవం కోసం, సమాజ హితం కోసం పోరాటం చేస్తానని అన్నారు.