అమెరికా చైనాల వాణిజ్యయుద్ధంపై ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడి ఆందోళన

SMTV Desk 2019-06-03 15:09:52  Philippine president Rodrigo Duterte, america, china trade war

టోక్యో: అమెరికా, చైనా దేశాల మధ్య జరుగుతున్న వాణిజ్య పోరు ప్రభావం అనేక దేశాలపై పడుతుంది. ఈ నేపథ్యంలో ఫిలిప్పైన్స్‌ అధ్యక్షుడు రోడ్రిగో డ్యుటెర్టే కూడా వాణిజ్య యుద్ధం కారణంగా తమ దేశంతో సహా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రప్రభావాన్ని చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం జపాన్‌లో పర్యటిస్తున్న డ్యుటెర్టే ఆ దేశ ప్రధాని షింజో అబేతో చర్చల అనంతరం ఏర్పాటు చేసిన సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ అగ్రదేశాల మధ్య కొనసాగుతున్న ఈ వివాదం ప్రపంచ వాణిజ్యం, పెట్టుబడులపై ప్రభావాన్ని చూపుతోందన్నారు. తమ దేశంలో అవినీతిని పూర్తిగా నిర్మూలించామని, పెట్టుబడులు సురక్షితమని అంటూ తమ దేశంలో పెట్టుబడులు పెట్టాలని జపాన్‌ పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించారు. ఫిలిప్పైన్స్‌ ఆర్థికాభివృద్ధికి జపాన్‌ గట్టి మద్దతునిస్తుందని ప్రధాని అబే డ్యుటెర్టేకు హామీ ఇచ్చారు. అంతకు ముందు శుక్రవారం ఇక్కడ భేటీ అయిన డ్యుటెర్టే అబేలు ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు.