అమెరికాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ !!

SMTV Desk 2019-06-02 11:52:09  america

పిల్లలు ఉన్నత చదువులు చదివి పట్టాలు అందుకునే సమయంలో తల్లిదండ్రులు ఆ కార్యక్రమానికి వెళ్లడం, తమ పిల్లలు పట్టభద్రులు అవుతుంటే అది చూసి ఆనందించడం సహజం. కానీ, టెక్సాస్‌కు చెందిన ఓ అమ్మాయి విషయంలో అది జరగలేదు. హై స్కూల్‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె డిప్లొమా పట్టా అందుకుంది. పట్టా చేతికి అందగానే వెంటనే అక్కడి నుంచి బయటకు పరుగులు పెట్టింది.

దీంతో అక్కడ ఉన్నవారికి ఆ అమ్మాయి ఎందుకు బయటకు పరుగు తీసిందో అర్థం కాలేదు. ఇక పట్టా అందుకున్న ఆ విద్యార్థిని నేరుగా ఓ బ్రిడ్జీ వద్దకు వెళ్లి ఆగింది. అక్కడ తన కోసం ఎదురుచూస్తున్న ఓ వ్యక్తి వద్దకు వెళ్లి అతణ్ణి ఆప్యాయంగా కౌగిలించుకొని కన్నీరు పెట్టుకుంది. అది చూసిన అక్కడి వారికి అసలేమి అర్థం కాలేదు.

ఆ వ్యక్తి ఎవరు? ఈ అమ్మాయి అతణ్ణి ఎందుకు ఆలింగనం చేసుకొని కన్నీరు పెట్టుకుంది? అనేది కొద్దిసేపు స్థానికులకు అర్థం కాలేదు. ఆ తరువాత అసలు విషయం తెలుసుకొని వారి గుండెలు బాధతో బరువెక్కాయి. ఇంతకు ఆ బ్రిడ్జీ దగ్గర అమ్మాయి కోసం ఎదురుచూస్తున్న వ్యక్తి ఎవరో కాదు ఆమె కన్నతండ్రి. మెక్సికో, యూఏస్‌ దేశాలను వేరు చేసేదే ఆ బ్రిడ్జీ. దశాబ్దం క్రితం తండ్రికి దేశ బహిష్కరణ శిక్ష పడడంతో మెక్సికో వెళ్లిపోయిందా కుటుంబం. అప్పటి నుంచి తండ్రి అగ్రరాజ్యంలో అడుగుపెట్టలేదు. కూతురు సరాయి రూయిజ్ ప్రతిరోజు మెక్సికన్ బార్డర్‌ను క్రాస్‌చేసి టెక్సాస్‌లోని లారెడొలో గల తన స్కూల్‌కు వెళ్లి వస్తుంది.

ప్రస్తుతం ఈ కుంటుంబం మెక్సికోలోని న్యూవో లారెడోలో నివాసముంటుంది. ఇక తండ్రి ఎలాగు సరిహద్దు దాటి తన స్కూల్‌కు రాలేడని భావించిన రూయిజ్.. గత దశాబ్దకాలంగా తన కోసం తండ్రి పడుతున్న వేదనను బయటి ప్రపంచానికి తెలిజేయాలని నిర్ణయించుకుంది. దీనికి గ్రాడ్యుయేషన్ డేను వేదికగా మార్చుకుంది. తండ్రిని కలుసుకునే దృశ్యాలను మొబైల్‌లో వీడియో తీయమని తన స్నేహితురాలికి రూయిజ్ ముందే చెప్పింది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేయగా అది కాస్తా వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.