ప్రత్యేక హోదాపై స్పష్టంగా మాట్లాడలేక జగన్‌ డొంకతిరుగుడు

SMTV Desk 2019-06-01 14:13:06  Ganta Srinivas, Jagan,

నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మాజీ సీఎం చంద్రబాబును జగన్ ఆహ్వానించినా ఆయన హాజరు కాలేక తన తరుఫున ప్రతినిధులను పంపాలని నిర్ణయించారు. ఈ బాధ్యతలను టీడీపీ ఎమ్మెల్యేలు గంటా, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్‌లకు బాబు అప్పగించారు. దీంతో వారు జగన్ కలిసి శుభాకాంక్షలు తెలియజేయాలని ప్రయత్నించినా సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని ప్రచారం సాగుతోంది. తాజాగా, దీనిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌కి టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలిపేందుకు రెండు రోజుల పాటు ప్రయత్నించినా అవకాశం లభించలేదని వ్యాఖ్యానించారు.

జగన్‌ వద్దకు వెళ్లి స్వయంగా శుభాకాంక్షలు తెలపడానికి తనతోపాటు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడును పార్టీ అధిష్ఠానం సూచించింది అని అయితే తాము జగన్‌ను కలిసే ప్రయత్నం చేసినా కుదరలేదని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్‌ చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని గంటా అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షంతో పాటు మీడియానూ బెదిరిస్తున్నట్లుగా మాట్లాడారని, ఎన్నికల వేళ నవరత్నాల పేరిట ఇచ్చిన హామీల నుంచి అప్పుడే తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారనీ ఆయన వ్యాఖ్యానించారు. ఢిల్లీలో మోదీని కలిశాక ప్రత్యేక హోదాపై స్పష్టంగా మాట్లాడలేక జగన్‌ డొంకతిరుగుడుగా వ్యవహరించారని ధ్వజమెత్తారు.