అతి విశ్వాసం కొంప ముంచింది

SMTV Desk 2019-05-31 15:50:34  Mp vinod,

ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ దెబ్బ మామూలుగా లేద‌ని, ఆయ‌న హ‌వా ముందు తాను నిల‌వ‌లేక‌పోయాన‌ని తెరాస క‌రీంన‌గ‌ర్ మాజీ ఎంపీ బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ అస‌లు విష‌యం అంగీక‌రించారు. ఎప్పుడు తెరాస‌కు ప‌ట్టం క‌ట్టే ప్ర‌జ‌లు ఈ ద‌ఫా ఎందుకు వ్య‌తిరేకించారో, బీజేపీనే ఎందుకు అక్కున చేర్చుకున్నారో అర్థం కావ‌డం లేద‌ని, ఏది ఏమైనా ప్ర‌జా తీర్పును గౌర‌విస్తామ‌ని చెప్పుకొచ్చారు. శుక్ర‌వారం మీడియాతో మాట్లాడిన బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ త‌న ఓట‌మిపై ప‌లు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో దేశ వ్యాప్తంగా మోదీ హ‌వా కొన‌సాగింద‌ని, త‌న ఓట‌మికి ఏ కార‌ణాలు బ‌లంగా ప‌ని చేశాయో స‌మీక్షించుకుంటాన‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

గెలుపు ఖాయ‌మ‌ని అతిగా విశ్వ‌సించాము కాబ‌ట్టే దారుణంగా ఓడిపోయాన‌ని, అతి విశ్వాసం కూడా కొంప‌ముంచింద‌ని చెప్పుకొచ్చారు. తెలంగాణ ఉద్య‌మం ఇంకా ఆగ‌లేద‌ని, రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయ్యే వ‌ర‌కు అది కొన‌సాగుతూనే వుంటుంద‌ని, త‌న ప్రాణం వున్నంత వ‌ర‌కు తెలంగాణ ప్ర‌జ‌ల కోసం పాటు ప‌డుతూనే వుంటాన‌ని ఓడిపోయినా ప్ర‌జా క్షేత్రంలోనే ప్ర‌జ‌ల‌తో క‌లిసి వుంటాన‌ని బోయిన‌ప‌ల్లి వినోద్‌కుమార్ వెల్ల‌డించారు. వినోద్‌కుమార్ బీజేపీ అభ్య‌ర్థి బండి సంజ‌య్ చేతిలో ఓట‌మి పాలైన విష‌యం తెలిసిందే. అయితే వినోద్ ఆవేద‌న ప్ర‌స్తుతం తెరాస‌లో అంత‌ర్గ‌తంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. అతి విశ్వాసం దెబ్బ కొట్టిన మాట నిజం అనీ అంగీక‌రిస్తున్నారంతా.