వారి లైసెన్స్‌లు రద్దు!

SMTV Desk 2019-05-30 18:19:49  rajastan high court, rajastan government cancelled illiterate licenses

వాహన చోదులకు రాజస్తాన్ హైకోర్టు షాక్ ఇచ్చింది. ఇకపై నిరక్షరాస్యులైన వాహన చోదకుల డ్రైవింగ్ లైసెన్స్‌లను క్యాన్సల్ చేయాలని రాజస్తాన్ హైకోర్టు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. నిరక్షరాస్యులైన వాహన చోదకులు పాదాచారులకు హానికరంగా మారారని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలోనే వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను రద్దు చేయాలని రవాణా అధికారులను ఆదేశించింది. డ్రైవింగ్ లైసెన్స్‌ను కోరేవారిని మాత్రమే కాకుండా, రోడ్లను ఉపయోగించే ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకుని డ్రైవింగ్ లైసెన్సులను జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. నిరక్షరాస్యులు ఏదైనా వాహనాన్ని నడిపేందుకు అనుమతి ఇస్తూ డ్రైవింగ్ లైసెన్సును మంజూరు చేయరాదని తెలిపింది. నిరక్షరాస్యుడైన సంజీవ్ ప్రకాశ్ శర్మ అనే వ్యక్తి రవాణా అధికారుల నుంచి లైసెన్స్ ఇప్పించాల్సిందిగా హైకోర్టును అశ్రయించారు. ఈయన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలోనే ఈ తీర్పును వెలువరించింది.సెంట్రల్ మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు ఎలాంటి విద్యార్హత అవసరం లేదు. లైసెన్స్‌కు దరఖాస్తు చేసుకునే వ్యక్తి ఆర్‌టీవో అధికారులు నిర్వహించే పరీక్షలో ఉతీర్ణులు అయితే చాలు. లైసెన్స్ వస్తుంది. వాణిజ్య వాహనానికి డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే 8వ తరగతి వరకు చదివి ఉండాలి.