గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ ఘన విజయం

SMTV Desk 2019-05-30 13:03:36  KKE Communist Party of Greece

ఏథెన్స్‌: గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ (కెకెఇ) యూరోపియన్‌ పార్లమెంటుతో పాటు ప్రాంతీయ, మున్సిపాల్టీలకు తిరిగి రెండు పార్లమెంటు స్థానాలను దక్కించుకుంది. పాలక సిరిజా పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత చాలా స్పష్టంగా కనిపించింది. దీంతో జూన్‌ చివరిలో గ్రీస్‌ పార్లమెంటు ఎన్నికలకు వెళ్లనున్నట్లు సిరిజా పార్టీ ప్రకటించింది. గ్రీస్‌ కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి డిమిట్రిస్‌ కౌట్‌సోంపస్‌ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల జేశారు. గడ్డు పరిస్థితుల మధ్య పార్టీ పిలుపునందుకుని ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు ఓటేసిన వారందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఐరోపా పార్లమెంటు ఎన్నికల, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వచ్చే గ్రీస్‌ పార్లమెంటు ఎన్నికల ఫలితాలకు ఒక సంకేతమని ఆయన చెప్పారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీ పడిన సిరిజా, ఎన్‌డి పార్టీలు రెండిటిపైన ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, పెట్టుబడికి, ఇయు, నాటోలకు దాసోహమైన ఈ రెండు పెద్ద పార్టీలకు ప్రత్యామ్నాయం ముందుకు రావాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు. తప్పుడు హామీలు ఇవ్దడం, విద్వేషాలు, ఘర్షణలు సృష్టించి ప్రజల్లో చీలికలు తేవడం, రెండు పార్టీల వ్యవస్థను సుస్థిరం చేసుకునేందుకు ఈ రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని కెకెఇ విమర్శించింది.