ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అధికార కూటమికి షాక్

SMTV Desk 2019-05-28 15:38:36  2019 European Parliament Elections

బ్రస్సెల్స్‌: ఐరోపా పార్లమెంటు ఎన్నికల్లో అధికార కూటమికి గట్టి షాక్ తగిలింది. ఐరోపా కూటమి భవిష్యత్తుపై అనిశ్చితి, వాతావరణ మార్పులపై సర్వత్రా నెలకొన్న ఆందోళన నేపథ్యంలో జరిగిన ఈ ఎన్నికల్లో బ్రిటన్‌లో బ్రెగ్జిట్‌ పార్టీ, ఫ్రాన్స్‌లో మేరీ లీపెన్‌ నేతృత్వంలోని పచ్చి మితవాద పార్టీ నేషనల్‌ ర్యాలీ, జర్మనీలో గ్రీన్స్‌, ఇటలీలో మితవాద ఇటలీ లీగ్‌ తమ బలాన్ని తీవ్రంగా పెంచుకున్నాయి. స్పెయిన్‌లో సోషలిస్టులు మంచి మెజార్టీనే సాధించారు. అలాగే గ్రీస్‌లో సిప్రాస్‌ నేత్వృంలోని సిరిజా పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఫ్రాన్స్‌లో జాతి వ్యతిరేకత, ఇస్లామిక్‌ వ్యతిరేకత, విదేశీ వ్యతిరేకత, విద్వేష రాజకీయాలకు పెట్టింది పేరైన మెరీ లీపెన్‌ పార్టీ 23.31 శాతం ఓట్లతో 22 సీట్లు సాధించి మాక్రాన్‌ పార్టీ కన్నా ముందంజలో ఉన్నది. మాక్రాన్‌ నేతృత్వంలోని లా రిపబ్లికా ఎన్‌మార్చ్‌ పార్టీ 22.41 శాతం ఓట్లతో 21 సీట్లతో వెనుకబడింది. మాజీ అధ్యక్షుడు నికోలస్‌ సర్కోజీ సారథ్యంలోని రిపబ్లికన్స్‌ పార్టీకి 8.4 శాతం, లెఫ్ట్‌ పార్టీలకు 6.3 శాతం ఓట్లు లభించాయి. గత ఆరు మాసాలుగా కొనసాగుతున్న యెల్లో వెస్ట్స్‌ ఉద్యమం మాక్రాన్‌ ప్రభుత్వ విధానాలపై ఒక తిరుగుబాటు లాంటిది. ఇప్పుడీ ఎన్నికల ఫలితాలు ప్రభుత్వానికి గట్టి హెచ్చరికనే చేశాయి. వాతావరణ మార్పుల సంక్షోభం పై ప్రజల్లో పెరుగుతున్న ఆందోళనను గ్రీన్స్‌ పార్టీ చక్కగా ఉపయోగించుకుని ఈ ఎన్నికల్లో బలాన్ని పెంచుకుంది. ఈయూ పార్లమెంటులో 69 స్థానాలను గెలుచుకుని బలమైన శక్తిగా ఆవిర్భవించింది. గత సారి ఈ పార్టీకి 51 స్థానాలు మాత్రమే ఉండేవి. జర్మనీలో ఏంజెలా మెర్కెల్‌ నేతృత్వంలోని సిడియు మొదటి స్థానంలో వుండగా, గ్రీన్స్‌ రెండవ స్థానంలో నిలిచింది. ఐర్లండ్‌లో మొదటి స్థానం, ఫిన్లాండ్‌లో 16 శాతం ఓట్లతో రెండవ స్థానంలోను, ఫ్రాన్స్‌, లగ్జెంబర్గ్‌లో మూడవ స్థానంలోను, బెల్జియం, నెదర్లాండ్స్‌లో మూడవ స్థానం సాధించింది. ఆస్ట్రియాలో రెండు స్థానాలు సాధించింది. తూర్పు, దక్షిణ యూరపు దేశాల్లో గ్రీన్స్‌కు ఒక్క స్థానం కూడా లభించలేదు.