కన్న తల్లిని, మాతృభాషను మర్చిపోయిన వాడు మానవుడు కాదు: వెంకయ్యనాయుడు

SMTV Desk 2017-08-26 17:16:35  AP Chief Minister, Chandrababu naidu, Venkaiah naidu, Vice prersident of India, Honor

అమరావతి, ఆగస్ట్ 26: నేడు భారత 13వ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని ఏపీ ప్రభుత్వం పౌర సన్మానంతో పురస్కరించింది. ఈ నేపధ్యంలో ఆయన మాట్లాడుతూ... ప్రతీ పల్లెకి రోడ్డు ఉండాలనేది తన అభిమతమని, రోడ్లు లేకపోతే గ్రామాలకు అనుసంధానం ఉండదు. దీనివల్ల గ్రామాభివృద్ధి కుంటుబడుతుంది. ఇదే విషయంపై తాను గతంలో పలు మార్లు పార్లమెంట్ లో చర్చించాను. కానీ, ఎవరికి అవగతం కాలేదు. గ్రామ రాజ్యం లేకుండా రామ రాజ్యం సాధ్యపడదు అని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మాతృ భాష ప్రాముఖ్యత గురించి ఆయన ప్రస్తావించారు. మాతృభాషను, కన్నతల్లిని, పుట్టిన గడ్డను మర్చిపోయిన వాడు మానవుడు కాదు కనుక మాతృభాషను అధికార భాషగా గౌరవించాలని ఆయన తెలిపారు. అందరి అభిమానంతో దేశంలోనే రెండో అత్యున్నత పదవైన ఉపరాష్ట్రపతి పదవి తనకు దక్కడం, తాను చేసుకున్న అదృష్టమని తెలిపారు. రాజ్యసభ ఛైర్మన్ గా సభకు పూర్వ వైభవం తీసుకొస్తానని... పెద్దల సభగా మారుస్తానని చెప్పారు. దేశ భవిష్యత్తును మార్చే అర్థవంతమైన చర్చలకు స్థానం ఉండాలి, అవినీతిని మట్టికరిపించేలాంటి చట్టాలు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా వెంకయ్య వ్యాఖ్యనించారు. ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి, ఆవేదన దేశానికి మంచిది కాదని, ఇది ప్రజాస్వామ్యానికి, చట్ట సభలకు మంచిది కాదని, ప్రజాస్వామ్య వ్యవస్థ కూడా కూలిపోయే అవకాశం ఉందని, ఈ పరిస్థితి తలెత్తకుండా కాపాడాల్సిన బాధ్యత చట్ట సభలపై ఉందని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ రాజకీయ విరోధులే కాని, శత్రువులు కాదని... అందుకే, విమర్శలు చేసుకునేటప్పుడు ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన తెలిపారు. ఇంకా ఆయన ప్రసంగిస్తూ... ప్రజలకు అన్నిటికన్నా ముఖ్యమైనది గృహం. ఆర్థికపరమైన వ్యత్యాసాలున్న మన దేశంలో ప్రతీ ఒక్కరి ఇల్లు సాధ్యమేనా అనే అనుమానం అందరిలో ఉండేది. మోదీ కేబినెట్‌లో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉండటం తన అదృష్టమని, ఆ సమయంలోనే దేశంలో లక్షలాది ఇళ్లకు పునాది వేశామని తెలిపారు. దేశం మొత్తానికి 26 లక్షల ఇళ్లు మంజూరైతే, ఒక్క ఏపీకే 5 లక్షల 35వేల ఇళ్లు వచ్చాయని వెంకయ్య అన్నారు.