‘టీవీ 9’ సీఈఓ రవిప్రకాశ్ కు కేఏ పాల్ మద్దతు

SMTV Desk 2019-05-10 16:35:10  k a paul, tv9 ceo, ravi prakash, prajashanti party president

‘టీవీ 9’ సీఈఓ రవిప్రకాశ్ కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మద్దతు ప్రకటించారు. ఓ వీడియో పోస్ట్ లో ఆయన మాట్లాడుతూ, 2007 నుంచి రవిప్రకాశ్ తనకు తెలుసని, సీఈఓ పదవి నుంచి ఆయన్ని తప్పించారన్న వార్తలు విని షాకయ్యానని చెప్పారు. రవి ప్రకాశ్ పై ఒత్తిడి చేసి సీఈఓ పదవి నుంచి ఆయన్ని ఎవరైనా తప్పించాలని చూస్తే ఖబడ్దార్, ‘నేనున్నాను. రవిప్రకాశ్ తో, టీవీ 9తో నేనున్నా’ అంటూ వ్యాఖ్యానించారు. మనందరం కలిసి ఉండాలని, అన్యాయం ఎవరికీ జరగకూడదని అన్నారు.

1999లో అమెరికాలో తన ఆర్గనైజేషన్ కు ఫౌండర్ ప్రెసిడెంట్ గా తనను ఆ పదవి నుంచి తీసేసిన సంఘటన గురించి ఆయన గుర్తుచేశారు. ఆ తర్వాత పోరాడి మళ్లీ తన పదవిని కాపాడుకున్నానని చెప్పారు. అందుకే, ఆ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. ‘టీవీ 9’ యాజమాన్యానికి, రవిప్రకాశ్ కు మధ్య ఏవైనా గొడవలుంటే వాటి పరిష్కారానికి అవసరమైతే తన వంతు ప్రయత్నం చేస్తానని చెప్పారు.