కేవీపీ.. ఉండవల్లి... జగన్‌కి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు

SMTV Desk 2019-05-09 13:42:00  Devineni uma,

ఏపీ లో ఎన్నికల సమర ముగిసిన తర్వాత పోలవరంపై తీవ్ర రచ్చ సాగుతుంది. పోలవరం ప్రాజెక్టు పనులను అడ్డుకొనేందుకు లోటస్‌పాండ్‌ కేంద్రంగా కేసీఆర్‌, జగన్‌ కుట్రలకు ప్లాన్ వేస్తున్నారని విమర్శించారు ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. నిన్న ఆయన విజయవాడలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. వేల మంది కార్మికుల ప్రాణాలను ఫణంగా పెట్టి పోలవరం పనులు చేస్తుంటే.. రాజమండ్రి కొట్టుకుపోతుందని కొందరు అసత్యాలు చెప్పడం విడ్డూరంగా ఉందని... ఇది ప్రజలను పక్కదారి పట్టించే ప్రయత్నంలో భాగమేనని ఆయన మండిపడ్డారు.

అదేవిధంగా పదే పదే ఉత్తరాలు రాసే కేవీపీ.. ఉండవల్లి... జగన్‌కి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. జగన్‌పై ప్రేమ ఉంటే వైసీపీలో చేరాలని ఉండవల్లికి ఆయన సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేసీఆర్‌ సుప్రీంకోర్టుని.. ఆయన కుమార్తె కవిత జాతీయ హరిత ట్రైబ్యునల్‌ని ఆశ్రయించినప్పుడు ఏం చేశారని ఉమామహేశ్వరరావు ప్రశ్నాస్త్రాలు సంధించారు.

అంతేకాకుండా పట్టిసీమ దండగ అని మాట్లాడిన నేతలు.. ఆ నీటి ద్వారా కృష్ణా జిల్లాకు... రాయలసీమ జిల్లాలకు ఎంత లబ్ధి చేకూరిందో ఎందుకు తెలుసుకోలేక పోతున్నారని ఆయన తెలిపారు. పోలవరానికి రావాల్సిన నిధులను కేంద్రంలో వచ్చే కొత్త ప్రభుత్వం, కొత్త ప్రధాని నుంచి సాధించుకుంటామని వివరించారు. పోలవరం జాతీయ ప్రాజెక్టును సందర్శించేందుకు ప్రధాని మోడీ, ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌కు తీరికలేకుండా పోయిందని దేవినేని ఉమ తీవ్ర విమర్శలు చేశారు. ఐదు కోట్ల మంది తెలుగు ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుపై విషం చిమ్మడం ఇప్పటికైనా ఆపాలని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వారికి సూచించారు.