మరోసారి భారత్ పై ధ్వజమెత్తిన ట్రంప్

SMTV Desk 2019-04-30 16:29:34  donlad trump, america, india, tax

వాషింగ్టన్‌: పన్నుల విషయంలో భారత్ పై అమెరిక అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ధ్వజమెత్తారు. పన్నులు వసూలు చేయడంలో భారత్ దిట్ట అని విరుచుకుపడ్డారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ భారీగా పన్నులు విధిస్తుందని ఆయన విమర్శించారు. భారత్‌ను పన్నుల రాజు అని అభివర్ణించారు. ఆదివారం విస్కాన్సిన్‌ రాష్ట్రంలోని గ్రీన్‌ బే సిటీలో రిపబ్లికన్‌ పార్టీ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అమెరికా ఉత్పత్తులపై దారుణంగా పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. దశాబ్దాలుగా భారత్‌, చైనా, జపాన్‌లకు కోట్లాది డాలర్లు చెల్లించి నష్టపోయాం. ఇకపై ఇలా జరగనీయను. ఇతర దేశాల కాగితం ఉత్పత్తులపై మనం పన్నులు వేయడం లేదు. అదే విస్కాన్సిన్‌లోని కాగితం పరిశ్రమలు విదేశాలకు ఎగుమతులు చేస్తే చైనా, భారత్‌ భారీగా పన్నులు వేస్తున్నాయి. అందువల్ల అన్ని దేశాలతో కొత్త వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవాలని భావిస్తున్నాం. మూడేళ్ల క్రితం హార్లీడేవిడ్‌సన్‌ మోటారు సైకిళ్ల కంపెనీ ప్రతినిధులను కలిశాను. భారత్‌లో మీ వ్యాపారం ఎలా ఉందని అడిగాను. ఆ దేశంలో ఎలాంటి వ్యాపారమూ చేయడం లేదని చెప్పారు. ఈ బైకులపై భారత్‌ 100 శాతం పన్ను విధిస్తోంది. మనం అక్కడ నుంచి వస్తున్న మోటారు సైకిళ్లపై ఎలాంటి పన్నూ వేయడం లేదు. ఇది అన్యాయమని నేను ప్రధాని మోదీకి చెప్పాను. దాంతో ఆయన పన్నును 50% తగ్గించారు. ఇది సరిపోదు అని ట్రంప్‌ అన్నారు. కొన్ని రకాల ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై విధిస్తున్న భారీ పన్నులను తగ్గించాలని అమెరికాను భారత్‌ కోరుతోంది. మరోవైపు అమెరికా కూడా వ్యవసాయ, పాల ఉత్పత్తులు, వైద్య పరికరాలు, ఐటీ, కమ్యూనికేషన్స్‌ రంగంపై విధిస్తున్న దిగుమతి సుంకాలను తగ్గించాలని భారత్‌ను కోరుతోంది.