ప్రపంచంలోనే తొలి 3D ప్రింట్ గుండె

SMTV Desk 2019-04-17 15:40:30  health tips, 3d heart, heart issues, heart attacks

ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలు మానవ కణజాలం, రక్త నమూనాలతో 3D ప్రింటెడ్ హార్ట్‌ను రూపొందించారు. ఇందులో మానవ గుండెలో ఉండే రక్తనాళాలు, కణాలతో సహా అన్ని అవయవాలు ఉన్నాయి. అయితే, గుండె తరహాలో రక్తాన్ని పంపింగ్ చేసే వ్యవస్థ మాత్రమే ఇందులో లేదు.

ఈ 3D గుండెను రూపొందించిన తెల్ అవీవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తల బృందానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ తల్ ద్వీర్ మాట్లాడుతూ.. ఈ ప్రయోగం ద్వారా భవిష్యత్తులో కృత్రిమ గుండెల తయారీ సులభతరం కానుందన్నారు. ఈ గుండె మొత్తాన్ని మానవ కణాజాలంతోనే తయారు చేశామన్నారు. రక్త ప్రసరణ వ్యవస్థ (పంపింగ్)ను కూడా అందుబాటులోకి తెస్తే.. గుండె మార్పిడి శస్త్ర చికిత్సలకు ఉపయోగపడుతుందని తెలిపారు.

ఇప్పటివరకు ప్రపంచంలో ఇలాంటి మానవ గుండెను ఎక్కడా తయారు చేయలేదన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైన నేపథ్యంలో భవిష్యత్తులో మానవ శరీరంలోని కీలక అవయవాలైనా కిడ్నీ, ఊపిరితీత్తులు, కాలేయాలను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. అయితే, తమ టీమ్ మొదటి లక్ష్యం 3D హార్ట్‌‌ను నిజమైన గుండెలా పనిచేసేలా చేయడమేనని ద్వీర్ తెలిపారు. ఈ 3D గుండె సైజులో చాలా చిన్నది. ఇది కుందేలు గుండె సైజులో ఉంది. భవిష్యత్తులో మానవ గుండె సైజులో దీన్ని తయారు చేయనున్నారు.