జ్ఞాప‌క‌శ‌క్తి మెరుగుపడాలంటే ఏం చెయ్యాలి?

SMTV Desk 2019-01-07 15:31:51   Health Tips , Health Problems , Health Benefits , Nutrition , Home Remedies

ఆధునిక జీవనంలో మనిషిపై వొత్తిడి అధికమవుతోంది. దాని ప్రభావం జ్ఞాపకశక్తిపై పడుతోదంది. ఎంతలా అంటే ఇంట్లో వొక దగ్గరపెట్టిన వస్తువు కోసం మరోచోట వెదికేంతగా అని చెప్పొచ్చు. ఆందోళన, వొత్తిడి దీనికి ప్రధాన కారణాలు. అంతేకాదు యాంత్రిక జీవితంలో టెక్నాలజీపై ఎక్కువ ఆధారపడిపోవడంతో సొంత జ్ఞాపకశక్తిపై పట్టుకోల్పోతున్నాం. ఈ సమస్య పెద్దలకే పరిమితం కావడంలేదు. పిల్లలపై కూడా అధికంగానే ఉందనేది నిపుణుల అభిప్రాయం. అయితే జ్ఞాపకశక్తి పెంచేందుకు కొన్ని ఆహారపు అలవాట్లు, మరికొన్ని చిట్కాలు పాటిస్తే సరిపోతుంది.

1. క్యారెట్‌, కాలీఫ్లవర్‌ను ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. 60గ్రాముల గోబీ, కొంచెం కొత్తిమీర తీసుకుని దానిపై కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం కలుపుకుని ఉదయాన్నే అల్పాహారంగా తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

2. రోజూ ఆహారంలో క్యాల్షియం ఎక్కువగా తీసుకోవాలి. క్యాల్షియం అధికంగా ఉండే పాలు, చీజ్‌, బట్టర్‌, పెరుగు వంటివి మెదడు ఉత్సాహానికి తోడ్పడతాయి. ప్రత్యేకించి పెరుగులో ఉండే ఎమినో యాసిడ్స్‌ జ్ఞాపకశక్తిని ప్రేరేపించేందుకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

3. భోజనం తర్వాత గ్లాసు మజ్జిగ తీసుకోవాలి. దీనివల్ల కాస్త వొత్తిడి, ఆందోళన తగ్గుతాయి. జ్ఞాపకశక్తి పెరగడానికి ఇది కూడా ఉపయోగకరమైందే.

4. పరీక్షల సమయంలో ఎక్కువ సమయం చదువుతూ ఉంటారు. అలాంటప్పుడు ప్రతి అరగంటకు వొకసారి మంచి నీళ్ళు తాగడం మంచిది.

5. పడుకునే సమయంలో కూర్చుని చదువుకుంటే విషయాలు మెదడుకు సులువుగా చేరతాయి. ఇలా నిటారుగా కూర్చుని చదివితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి కూడా మెరుగవుతుంది.