ఆర్‌కామ్‌ దివాలా పిటిషన్‌ను ఎన్‌సీఎల్ఏటీ ఆమోదించేనా?

SMTV Desk 2019-04-09 18:11:24  anil ambani, reliance communications, nclt

ముంభై: అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌) సంస్థ దివాలా పిటిషన్‌పై ఓ నిర్ణయం తీసుకుంటామని జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) వెల్లడించింది. రుణదాతలకు రుణాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్నామని, అందుకే తాము దాఖలు చేసిన పిటిషన్‌పై ముందుకెళ్లాలని ట్రైబ్యునల్‌ను ఆర్‌కామ్‌ అభ్యర్థించింది. అయితే స్వీడన్‌కు చెందిన టెలికం ఉపకరణాల తయారీ సంస్థ ఎరిక్‌సన్ మాత్రం ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియను వ్యతిరేకిస్తోంది. ఎన్‌సీఎల్ఏటీ ఒకవేళ రిలయన్స్ కమ్యూనికేషన్స్ దివాలా పిటిషన్‌ను అనుమతిస్తే.. ఎరిక్‌సన్ వడ్డీతో కలిపి రూ.550 కోట్లను ఆర్‌కామ్‌కు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌కామ్‌ దివాలా ప్రక్రియకు అనుమతించిన పక్షంలో ఎరిక్‌సన్ తనకు లభించిన రూ.550 కోట్లను వాపసు చేయాల్సి ఉంటుందని ద్విసభ్య బెంచ్‌ చైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ పేర్కొన్నారు. నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ)లో దివాలా ప్రొసీడింగ్స్‌ కొనసాగించడమా లేదా నిలిపివేయడమా అన్నదానిపై ఎన్‌సీఎల్‌ఏటీ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తదుపరి విచారణను ఎన్‌సీఎల్‌ఏటీ ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది.